Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐ అండ్ పీఆర్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అన్ని మున్సిపాల్టీల్లోనూ మౌలిక వసతుల అభివద్ధి, జీవన నాణ్యతలో గుణాత్మక వృద్ధి కనపరుస్తున్నదని తెలిపింది. ఆయా ప్రాంతాల సమగ్రాభివద్ధి కోసం అధికారులు, పాలకమండళ్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు దిశానిర్దేశం చేస్తున్నారని వివరించింది. రాష్ట్ర జీడీపీలో మూడింట రెండువంతుల వాటాను పట్టణ ప్రాంతాలు కలిగి ఉన్నాయని తెలిపారు. బెస్ట్ కమర్షియల్, రెసిడెన్షియల్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ మారిందని పేర్కొన్నారు. శివార్లలోని పది మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీతో అనుసంధానం చేసేందుకు 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి కోసం మున్సిపాల్టీల సంఖ్యను 69 నుండి 142కి పెంచినట్టు వివరించారు. వీటి విస్తీర్ణం రాష్ట్ర భూభాగంలో మూడు శాతం కంటే తక్కువగా ఉన్నా, రాష్ట్ర జీడీపీలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. పౌరుల జీవన నాణ్యత, సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న కషికి గుర్తింపుగా వరుసగా ఆరేండ్లుగా ''జీవన నాణ్యత సూచిక''లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయం, ఆస్తి ధర నుంచి ఆదాయ నిష్పత్తి , వాతావరణ సూచికలో హైదరాబాద్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. 2021లో రెసిడెన్షియల్ మార్కెట్లో 24312 యూనిట్ల అమ్మకాలతో 142 శాతం వద్ధిని హైదరాబాద్ సాధించిందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు ధర తగ్గని నగరం దేశంలోని 8 మెట్రోలలో హైదరాబాద్ మాత్రమేనని సమాచార, పౌర సంబంధాల శాఖ వివరించింది. ఒక చదరపు అడుగుకి రూ.4,450 సగటు రేటుతో మొదటి ఏడు మెట్రోనగరాల్లో సరసమైన నివాస నగరంగా హైదరాబాద్ కొనసాగుతున్నదని తెలిపారు. గతేడాది స్థూల ఆఫీస్ స్పేస్ పరంగా భారతదేశపు టాప్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచిందన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎస్ఆర్డీపీ కింద రూ.671.19 కోట్లు, సీఆర్ఎమ్పీకింద రూ.293.93 కోట్లు, హెచ్ఆర్డీసీఎల్ ద్వారా రూ.114.97 కోట్లు ఖర్చుతో మౌలిక వసతుల పనులను ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. ఎస్ఎన్డీపీ ద్వారా రూ.735 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు, రూ 231 కోట్లతో శివారు మున్సిపాల్టీల్లో 21 పనులు చేపట్టినట్టు తెలిపారు. పురపాలికల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.3,434 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనివల్ల పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. కొత్తగా 2,254 పారిశుద్ధ్య వాహనాల కొనుగోలుతో జీహెచ్ఎంసీ మినహా ఇతర పురపాలికల్లో మొత్తం శానిటేషన్ వాహనాలు సంఖ్య 4,882 లకు చేరిందనీ, రోజుకు 4,295 చెత్తను సేకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. పురపాలికల్లో చేపట్టిన 139 ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో 103 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. 139 పురపాలికల్లో 734 కొత్త వైకుంఠధామాల అభివద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. రూ.100.22 కోట్లతో మొత్తం అవుటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌తో పాటు అన్ని కూడళ్లు, ముఖ్యమైన సర్వీస్ రోడ్లలో ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్‌ను పూర్తి చేసినట్టు తెలిపారు. నానక్‌రాం గూడ నుంచి టీఎస్పీఏ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ప్రస్తుత రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నామన్నారు. రూ.312 కోట్లుతో అదే మార్గంలో, సోలార్ ప్యానెల్ పైకప్పులతో 21 కి.మీ., పొడవైన సైక్లింగ్ ట్రాక్ నిర్మిస్తున్నామన్నారు. జవహర్‌నగర్‌లో ప్రస్తుతం ఉన్న 19.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ సామర్థ్యాన్ని 48 మెగావాట్లకు పెంచుతున్నట్టు తెలిపారు. దుండిగల్‌లో 14.5 మెగావాట్ల కొత్త డబ్ల్యూటీఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ఆ ప్రకటనలో వెల్లడించారు. వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలిపారు. క్యాపిటల్ ఇంటెన్సివ్ పనులను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రూ.5983 కోట్ల విలువైన రుణాలను పొందిందనీ, ఆ సంస్థ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేశాక బ్యాంకులు నుంచి రూ.2000 కోట్లను రాష్ట్ర గ్యారెంటీ లేకుండానే పొందినట్టు వివరించారు. జీహెచ్ఎంసీ తన సొంత వనరులతో రూ. 8,965 కోట్ల విలువైన పనులను చేపడుతున్నట్టు తెలిపారు.