Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు కేంద్రమిచ్చిన హామీలను నెరవేర్చాలి : ఎస్కేఎమ్
- హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రాస్తారోకో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస మద్దతు ధరల చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 'విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి...కనీస మద్దతు ధరల చట్టాన్ని తేవాలి..తేవాలి...రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి..ఎత్తివేయాలి..ఆశిష్‌కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..చేయాలి...అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి..కౌలు రైతులకు రుణార్హత పత్రాలివ్వాలి' అంటూ రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. అక్కడే బైటాయించేందుకు నాయకులు యత్నించారు.
పోలీసులు నచ్చజెప్పి పక్కకు జరిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, కె.రంగయ్య, వస్కుల మట్టయ్య, నాయకులు మూడ్ శోభన్, ప్రజాసంఘాల నాయకులు లెల్లెల బాలకృష్ణ, కోట రమేశ్, తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకోను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎమ్ఎస్పీ చట్టంపై కమిటీ ఏర్పాటు విషయంపై మోసం చేసిందన్నారు. 29 మందితో కమిటీ వేస్తే అందులో బీజేపీకి, రైతు చట్టాలకు అనుకూలమైన వారే 26 మంది ఉన్నారనీ, అందుకు ముగ్గురు సంయుక్త కిసాన్ మోర్చా ముగ్గురు నాయకులు ఆ కమిటీని బహిష్కరిస్తూ పక్కకు తప్పుకున్నారని తెలిపారు. రైతులపై మోపిన తప్పుడు కేసులను ఇంకా ఎత్తివేయకుండా కేంద్రం తన హామీని విస్మరించిందని విమర్శించారు.
దొడ్డి దారిన విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. దాని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. యూపీలోని అలహాబాద్‌లో రైతు నేత ఆశిష్ మిట్టల్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. బెంగాల్‌లోని ఫరక్కాలో అదానీ హైవోల్టేజీ వైర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీచార్జినీ, ఛత్తీస్‌గఢ్‌లో, మహారాష్ట్రలో నిరసన తెలిపిన రైతులపై అణచివేతను ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలనీ, కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల లోపు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆహార ధాన్యాలకు ఎకరాకు 20వేల రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 40 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.