Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటనష్ట పరిహారంపై కేంద్రం రాష్ట్రం పరస్పర ఆరోపణలు
- ఏడేండ్లుగా ఇదే తంతు
- గతంలో అమలు చేసిన వాటికి ఫుల్స్టాప్
- అన్నదాత మెడకు అప్పులు
- పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు..
- రెండోసారి విత్తనంతో ఆర్థిక భారం
- విపత్తులతో రైతన్న చిత్తు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జూలై నెలలో పది రోజులపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విత్తిన విత్తనం మట్టిపాలైంది. మొలిసిన మొలకలు మురిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం గంగ పాలైంది. వాగులు, వంకలు తెగిపోయి, మడులు ఇసుక దిబ్బల్లా తయారయ్యాయి. వరదలకు కొట్టుకొచ్చిన ఇసుక విత్తనాలను కప్పేసింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనినుంచి రైతన్న పూర్తిగా కోలుకోక ముందే మళ్లీ మేఘాలు కమ్మేస్తున్నాయి. వానలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడు వానాకాలం సీజన్ సగానికి వచ్చింది. ఈ సమయంలో తిరిగి పంటలేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదు. నేల తడి ఆరిన తర్వాత దుక్కి దున్ని పంటలేద్దామనుకుంటే, మళ్లీ వానాలు కురుస్తున్నాయి. ఎక్కడో ఒకచోట మిగిలిన పంటల్లో విపరీతమైన కలుపు పెరిగింది. గడ్డిగాదంతో మడులు నిండిపోయాయి. రెండోసారి పంట వేయాలంటే పెట్టుబడికి కష్టంగా మారింది. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుజేయాలన్నా కూడా రెండోసారి వారికి అప్పు దొరికే పరిస్థితి లేదు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఈ నేపథ్యంలో పంటనష్టానికి కేంద్రం పరిహారమివ్వడం లేదంటూ రాష్ట్రం... తామిచ్చినా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ కేంద్రం... పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.
సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు
గత ఏడేండ్లుగా పంటనష్టంపై ఇదే తంతుగా మారింది. దీంతో అన్నదాత మెడకు అప్పులు చుట్టుకుంటున్నాయి. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల నేపథ్యంలో ఆదుకునే నాథుడే కరువయ్యాడు. విపత్తులతో రైతున్న రెండోసారి విత్తనాలు వేయడం ద్వారా మరింత భారం పడుతున్నది. ఈ పరిస్థితుల్లో అన్ని విధాలుగా రైతులు కుదేలవుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పంట నష్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర టీఆర్ఎస్ సర్కారు కాలయాపన చేస్తున్నాయి. అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. కానీ అనధికారిక లెక్కల ప్రకారం 15 లక్షల ఎకరాలు నష్టపోయినట్టు సమాచారం. మొత్తంగా పంట నష్టం అపారంగా ఉందనేది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాల్సి ఉంటుంది. అందుకు ఇతర శాఖలు అంచనా వేసినప్పటికీ వ్యవసాయ శాఖ మాత్రం అంచనా వేయడం లేదు. ముఖ్య మంత్రిగానీ, వ్యవసాయ శాఖ మంత్రిగానీ దీనిపై మాట్లాడం లేదు. కనీసం అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం లేదు. విచిత్రమేమిటంటే రైతులు తీవ్ర మనోవేదనతో ఉంటే, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాత్రం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి రైతులు ఆగమవుతుంటే, ఆయన మాత్రం రాష్ట్రంలో వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదనీ, అందుకు ఆధునిక యంత్రపరికరాలు కావాలని తిరుగుతున్నారు. రైతు బంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతుల ఖాతాల్లో అన్ని కోట్లు పడ్డాయి.. ఇన్ని కోట్లు పడ్డాయి అని ప్రచారం చేసుకునే మంత్రి... వానలకు ఇంత నష్టం జరిగింది... ఇన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది.. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.. ఆ రైతులను ఆదుకుంటామంటూ ఏ ఒక్కరోజూ చెప్పలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంచిర్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులకు తీవ్రమైన పంట నష్టం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం దారుణం.
పంటనష్టంపై నివేదికలేవి?
ప్రతి యేటా ఇదే విధంగా పంటనష్టం జరుగుతున్నది. 2018లో వచ్చిన వరదలకు నష్టపోయిన రైతులకు అరకొర నిధులను విదిల్చింది. కానీ 2020, 2021 సంవత్సరాల్లో వచ్చిన భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండోసారి కూడా విత్తనాలు వేశారు. దాదాపు రూ. 38వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు. దీనికి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. 2022 జనవరిలో మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో వరంగల్ జిల్లాలో పర్యటించారు. అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికీ ఆయన హామీలు ఆచరణకు నోచుకోలేదు. కనీసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేయడంలేదు. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఇచ్చే దుస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దీనిపై నివేదికలు పంపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.