Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలుపొందిన వారికి డబ్బులెలా ఇచ్చారు?
- ఎన్నేండ్లుగా సాగుతున్నది?
- ప్రముఖుల తరలింపునకు డబ్బులెలా వచ్చాయి?
- చీకోటి ప్రవీణ్ బృందంపై ఈడీ ప్రశ్నల వర్షం
- మొదటి రోజు 11 గంటల పాటు సాగిన విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
విదేశాల్లో క్యాసినోలను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను హవాలా ద్వారా చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌తో పాటు ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ప్రవీణ్‌తో పాటు ఆయన అనుచరులు మాధవరెడ్డి, సంపత్, రాకేశ్, బబ్లూలు బషీర్‌బాగ్‌లో ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. మొదటి రోజు 11 గంటల పాటు ఈడీ వీరిని విచారి ంచింది. ఈ ఐదుగురిని మొదట ఒకే దగ్గర కూర్చో బెట్టిన ఈడీ అధికారులు తర్వాత ఒక్కొక్కరిని వేర్వేరు గదుల్లోకి మార్చి ప్రశ్నించటం ప్రారంభించారు. ఒక్కో ప్రశ్నించే బృందానికి ఈడీ ఉన్నతాధికారి నాయకత్వం వహించారు. మొదట ప్రవీణ్‌ను ప్రశ్నిస్తూ ఆయన నుంచి నాలుగు బ్యాంకులకు సంబంధించిన స్టేట్మెంట్లను తీసుకొని వాటి ఆధారంగా ప్రశ్నలు వేయటం ప్రారంభించినట్టు తెలిసింది. ముఖ్యంగా, నేపాల్‌లోని స్టార్ హోటల్లో క్యాసినో నిర్వహణను ఏ విధంగా జరిపాడు? అందుకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయి? ఆ డబ్బులను ఆయన వినియోగించ టానికి ఎక్కడి నుంచి తరలించారు? అందుకు ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులేంటి? మొదలైన ప్రశ్నలతో ప్రవీణ్‌ను అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారని తెలిసింది.
అదే సమయంలో థారులాండ్, ఇండోనేషియా, శ్రీలంకలలో గత నాలుగేండ్లుగా క్యాసినోలను నిర్వ హించిన విధానాలపై తాము సేకరించిన ఆధారాలు ముందు పెట్టి మరీ ప్రశ్నించారని తేలింది. మరోవైపు, ఈ క్యాసినోలకు గత నాలుగేండ్లుగా వందలాది మందిని విమానాలలో వీరు తరలించిన తీరుపై కూడా ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ముఖ్యంగా, క్యాసినోలలో గెలుపోటముల తర్వాత అందులో పాల్గొన్న ఫంటర్స్‌కు డబ్బులు ఏ విధంగా చెల్లిం చారు? అందుకు ఏయే దేశాల నగదును వినియో గించారు? అందుకు అనుసరించిన తీరు తెన్నులపై కూడా ప్రవీణ్‌తో పాటు మిగతా నలుగురిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.
హైదరాబాద్ నుంచి చాలా వరకు ప్రముఖుల ను విదేశాలలోని తాము నిర్వహించిన క్యాసినోలకు తరలించటానికి ట్రావెల్ ఏజెంట్లుగా సంపత్ అనుసరించిన తీరు తెన్నుల పైనా, అందుకు భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై కూడా ప్రశ్నించారని తెలిసింది. ఆయా దేశాలలో క్యాసినో నిర్వహణకు చట్టపరంగా అనుమతులున్న కారణంగా తాము నిర్వహించామని ప్రవీణ్ సమాధానం చెప్పగా.. అందుకు హాజరైన వారి నుంచి లక్షల్లో రూపాయలను ఏ విధంగా వసూలు చేశారు? ప్రభుత్వ అనుమతులేమైనా తీసుకున్నారా? అనే ప్రశ్నలకు ప్రవీణ్ నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది.
కొన్ని సందర్భాలలో పొంతన లేని సమాధానాలు కూడా ప్రవీణ్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ ఇచ్చిన కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లను బట్టి హవాలా ద్వారానే సాగినట్టు కొన్ని ఆధారాలను ప్రవీణ్ ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నిం చారని సమాచారం. అలాగే, ప్రవీణ్, మాధవరెడ్డి ల మధ్య ఉన్న సంబంధాలు, వారి మధ్య సాగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నిం చారని తెలిసింది. ఒక్కోసారి ప్రవీణ్, మాధవరెడ్డి ల ను ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నించారని సమాచారం.
అలాగే గత మూడేండ్లుగా వివిధ దేశాల్లో ఏడుసార్లు క్యాసినోలను ప్రవీణ్ బృందం ఏర్పాటు చేసిందనీ, వాటికైన ఖర్చు ఎంత? అని కూడా ఈడీ వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా, క్యాసినోల నిర్వహణను ప్రవీణ్, మాధవరెడ్డిలు పర్యవేక్షించగా పెద్ద మొత్తంలో ఫంటర్లను క్యాసినోలకు తరలించే బాధ్యతలను సంపత్, రాకేశ్, బబ్లూ లు చూసుకున్నారని ఈ సందర్భంగా ఈడీ గుర్తించింది. మొత్తమ్మీద క్యాసినోల నిర్వహణ ద్వారా కోట్లాది రూపాయలను ప్రవీణ్ అండ్ కో గడించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. దాదాపు 11 గంటల పాటు ప్రవీణ్ బృందాన్ని ప్రశ్నించిన తర్వాత రాత్రి 10.05 గంటలకు ఈ ఐదుగురు ఈడీ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా వారిని ప్రశ్నించే ప్రయత్నం చేయగా సమాధానమివ్వకుండా వెళ్లిపోయారు. అయితే, నేడు (మంగళవారం) కూడా వీరిని ప్రశ్నించే అవకాశాలున్నాయని తెలుస్తుండగా అధికారుల నుంచి మాత్రం ఎలాంటి సమాచారమూ లేదు.