Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి
- 'ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే' సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
భూమిలేని పేదలందరికీ భూమి పంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, రైతు సంఘం, మహిళా, గిరిజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా మంచికంటి భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ర్యాలీ ఆనంతరం ఆర్.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రజాసంఘాల నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, కాసాని ఐలయ్య, యం.జ్యోతి మాట్లాడారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలివ్వాలనీ, పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, పోడు భూములకు, రెవెన్యూ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, 14రకాల వస్తువులు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, భూమిలేని పేదలందరికీ భూమి పంచాలని కోరారు. కూలి పెంచాలని, కనీస వేతన జీవోను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్ల సాధనకు పోరాటాలే మార్గమని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అన్నవరపు కనకయ్య, కున్సోత్ ధర్మా, యంవి.అప్పారావు, అన్నవరపు సత్యనారాయణ, గుగులోత్ ధర్మా, బుక్యా రమేశ్, ఈర్ల రమేశ్, కొండబోయిన వెంకటేశ్వర్లు, ఉప్పనపల్లి నాగేశ్వరరావు, శెట్టి వినోద, నందిపాటి రమేశ్, డి.వీరన్న, ఈసం నరసింహారావు, యస్.లక్ష్మి, కె.నవీన్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.