Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగైన వైద్యం అందించాలి
- వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-బేల/ సిరిసిల్ల టౌన్
ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. సిరిసిల్ల గురుకుల పాఠశాలను వారు సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కేజీబీవీ(కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం)లో 28 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి వసతిగృహంలో చికెన్ కూర, అన్నం చేశారు. అన్నంలో పురుగులు రావడంతో చాలా మంది అన్నం తినకుండానే రాత్రి నిద్రపోయారు. సోమవారం ఉదయం కొందరు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. సుమారు 28మంది విద్యార్థినులను 108లో రిమ్స్‌కు తరలించారు. మిగతా విద్యార్థినులకు పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆందోళనచెందారు.ఉదయం సిబ్బంది ఉప్మా చేసినా 11 గంటలకు ఎవరూ తినలేదు. దీంతో నీరసం వచ్చి తల తిప్పడంతోపాటు కడుపులో మంటతో బాధపడ్డారు. విషయం తెలుసుకొని డాక్టర్ క్రాంతికుమార్‌తోపాటు ఎస్ఐ కృష్ణకుమార్, భీంపూర్ ఎస్ఐ రాధిక వసతిగృహానికి చేరుకున్నారు. ఆరుగురికి కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో వారిని సైతం రిమ్స్‌కు తరలించారు. సిబ్బందితోపాటు వైద్యులు అక్కడ వండిన ఆహారాన్ని తిన్నారు. అనంతరం భయపడుతున్న విద్యార్థినులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అస్వస్థతకు గురైన విద్యార్తినులకు ఓఆర్ఎస్ నీళ్లతోపాటు మందులు అందించారు. విద్యార్థులు తినడానికి భయపడటంతో మధ్యాహ్నం వారితోపాటు అధికారులు కలిసి భోజనం చేశారు. డీఈఓ ప్రణీత తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థతిని తెలుసుకున్నారు. రాత్రి, ఉదయం తినకపోవడంతో విద్యార్థినులు నీరసంతో అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ చెప్పారని ఆమె అన్నారు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పారని, బాధ్యులను హెచ్చరించామని తెలిపారు. తీరు మారకపోతే వారిని తొలగిస్తామన్నారు.
ప్రత్యేక అధికారి శంకర్, కస్తుర్బాగాంధీ ప్రత్యేక అధికారి ఉదయశ్రీ, డీడబ్ల్యుఓ మిల్కా, ఎంఈఓ శ్రీనివాస్, డీఎస్ఓ శ్రీకాంత్, తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీఓ భగత్ రవీందర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, బీజేపీ నాయకురాలు సుహాసినిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, దేవన్న, కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాక్లే విద్యార్థినులను పరామర్శించారు.
గురుకుల పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నాయకుల సందర్శన
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జ్వరాల బారిన పడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వారు గురుకులాన్ని సందర్శించారు. అనంతరం వైద్యశాఖ అధికారులతో మాట్లాడి మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు మల్లారపు ప్రశాంత్, అంగూరి రంజిత్ మాట్లాడుతూ.. ఆదివారం విషజ్వరాలతో విద్యార్థులు అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పెద్దూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలోని ప్రతి హాస్టల్ తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. హాస్టల్స్ ప్రారంభమైనప్పుడే పరిశీలించి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టల్ అన్నింటికీ పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. ప్రతి విద్యార్థికీ ఆరోగ్య పరీక్షలు చేసి సరైన వైద్యం అందించాలన్నారు. నాణ్యమైన భోజనం అందిం చేలా చర్యలు తీసుకోవాలని, రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.