Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైరవీలకే సర్కారు అందలం
- పీఆర్టీయూ నాయకులకే ప్రాధాన్యం
- అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. పైరవీలకే ప్రభుత్వం అందలం వేస్తున్నది. పీఆర్టీయూ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలో వారు చెప్పినోళ్లకే అక్రమ పద్ధతిలో ప్రభుత్వం బదిలీలు చేస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్ నుండి నారాయణపేట జిల్లాకు కేటాయించిన పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా నాయకులు జి రఘురామరెడ్డి, నారాయణగౌడ్లను 317 జీవో పేరు మీద దొడ్డిదారి బదిలీ చేశారు. రఘురామరెడ్డిని నారాయణపేట జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలంలోని మొగల్‌మడ్క జెడ్పీహెచ్‌కు పాఠశాలకు విద్యాశాఖ బదిలీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని నారాయణపేట డీఈవో సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో స్పౌజ్ బదిలీలపై నిషేధం విధించిన మహబూబ్ నగర్ జిల్లాకు ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండానే అత్యంత జూనియరైన ఉపాధ్యాయులను బదిలీ చేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుందంటూ టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అర్హతగలిగిన సాధారణ ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించకుండా జూనియర్ అయిన కారణంగా స్థానికతను కోల్పోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోయిన వారి గోడును ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకుండా పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలు చేయటం, డిప్యూటేషన్లు ఇవ్వటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ ఈ అన్యాయాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలను గాలికొదిలి అక్రమంగా బదిలీలు చేయించుకున్న నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. అక్రమ బదిలీలు రద్దు చేసి సాధారణ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయకుంటే పోరాడతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.