Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్లస్థలాలివ్వాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 18 లోని 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కావాలంటూ ఇల్లు లేని స్థానిక పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారని ఆ పార్టీ తెలిపింది. గుడిసెలు వేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పేద ప్రజలపైనా, సీపీఐ(ఎం) నాయకులపైనా పోలీసులు అన్యాయంగా లాఠీచార్జీ చేశారని విమర్శించింది. వారిని అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లలో ఉంచిందని పేర్కొంది. పేదల ప్రజల అరెస్టు, లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లుగా భూమి కోసం, ఇండ్లస్థలాల కోసం స్థానిక అధికారులకు అనేక విజ్ఞప్తులు చేసినా, ఆందోళనలు సాగించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఇండ్లస్థలాలు కావాలంటూ వారు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇండ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. తక్షణమే ఆ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.