Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ సహా వృత్తికోర్సులకు వర్తింపు
- కరోనా, ఆర్థిక ఇబ్బందులతో టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం
- నేడో, రేపో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- విద్యార్థులకు ఉపశమనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యాకోర్సులకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2022-23) లోనూ పాత ఫీజులే కొనసాగనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంటే 2019-20, 2020-21, 2021-22 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులే ఈ ఏడాదికీ వర్తించనున్నాయి. 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల్లో ఫీజుల పెంపునకు సంబంధించి అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయించాలని అభిప్రాయపడినట్టు సమాచారం. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. రెండు విద్యాసంవత్సరాలుగా కరోనా మహమ్మారి విద్యారంగంతోపాటు ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే విద్యాసంస్థలు సకాలంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదుటపడలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకే సకాలంలో జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యాకోర్సులకు ఫీజులను పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడుతుందన్న అభిప్రాయానికి టీఏఎఫ్ఆర్సీ వచ్చినట్టు సమాచారం. అందుకే పాత ఫీజులనే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌తోపాటు లా, బీఈడీ, బీపీఈడీ, ఫార్మసీ కాలేజీ యాజమాన్యాలతో టీఏఫ్ఆర్సీ ఫీజులపై సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఫీజులు పెంచాలంటూ ఆయా కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఫీజులను పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ సైతం నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని తెలిసింది. ఫీజుల పెంపు, పాత ఫీజుల కొనసాగింపుపై టీఏఎఫ్ఆర్సీ కమిటీలో విస్తృతంగా చర్చించాయి. న్యాయపరంగా వచ్చే ఇబ్బందులనూ చర్చించినట్టు సమాచారం. అయితే కరోనా, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పాత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం తరఫున ఓ అధికారి ప్రతిపాదించారు. దీనికి సభ్యులు అంగీకరించడంతో ప్రస్తుత విద్యాసంవత్సరానికి పాత ఫీజులే కొనసాగనున్నాయి. దీంతో పేదలు, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి మంగళవారం లేదా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీ పంపించే అవకాశమున్నది.
ఇంజినీరింగ్ అధిక ఫీజు రూ.1.34 లక్షలే
రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు జరిపింది. 2022-23, 2023-24, 2024-25 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజులను ఖరారు చేసింది. అయితే రాష్ట్రంలో ఇంజినీరింగ్విద్యకు సంబంధించి గరిష్ట ఫీజు సీబీఐటీకి రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షలకు పెంచింది. కనిష్టఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో 2019-20, 2020-21, 2021-22 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ అమలు కానున్నాయి. అప్పుడు గరిష్ట ఫీజు సీబీఐటీకి రూ.1.34 లక్షలు అమల్లో ఉన్నది. కనిష్ట ఫీజు రూ.35 వేలు కొనసాగనుంది. అంటే ఇంజినీరింగ్‌లో అధిక ఫీజు రూ.1.34 లక్షలు అమలు కానుంది. బీఈడీకి కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.36 వేలుగా టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించింది. లా కోర్సుకు కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.36 వేలుగా ఖరారు చేసింది. ఎల్ఎల్ఎం కోర్సు కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.45 వేలు ప్రతిపాదించింది. బీపీఈడీకి కనీస ఫీజు రూ.17 వేలు, గరిష్ట ఫీజు రూ.28 వేలుగా ఖరారు చేసింది. బీఈడీ, లా, ఎల్ఎల్ఎం, బీపీఈడీతోపాటు ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సులకు సంబంధించి పాత ఫీజులే అమలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ప్రతిపాదనలను పరిశీలించి ఉత్తర్వులు విడుదల చేస్తుంది. ఆ ఫీజులపై అభ్యంతరం ఉన్న కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. దీనిపై ఇంజినీరింగ్ సహా వృత్తి కాలేజీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం.
టీఎస్టీసీఈఏ హర్షం
ఫీజుల పెంపుదలను వాయిదా వేస్తూ పాత ఫీజులనే కొనసాగించాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించడం పట్ల టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ హర్షం ప్రకటించారు. ఫీజులపై వాచారణ చేపట్టినా, ఉద్యోగుల జీతాలపై విచారణ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకి మేలు జరిగేలా నిబంధనలకు అనుగుణంగా జీతాలు సకాలంలో చెల్లిస్తున్నాయా? లేదా? వారికి కనీస వసతులు కల్పిస్తున్నాయో? లేదో పరిశీలనా చేయాలని కోరారు. ఉద్యోగులకి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.