Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి
- పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలి:
వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎమ్యూ ఆధ్వర్యంలో ఎస్వీకే వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కూలీల జీవన భద్రత కోసం దేశవ్యాప్తంగా సమగ్ర చట్టం తేవాలనీ, విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎమ్యూ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. 'విద్యా, వైద్య రంగాల ప్రయివేటీకరణను వ్యతిరేకించండి.. వ్యతిరేకించండి ..కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని కాపాడు కుందాం.. కాపాడుకుందాం ...ఇవ్వాలి. .ఇవ్వాలి... పోడు రైతులకు హక్కు పత్రాలివ్వాలి... కాపాడు కుందాం.. కాపాడుకుందాం..ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం..ఉపాధి హామీ కూలీల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి' అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, బీకేఎమ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ మాట్లాడుతూ.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైం దని విమర్శించారు.
ఉపాధి హామీ చట్టాన్ని సక్రమ ంగా అమలు చేయాలనీ, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ కింద 200 పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 వేతనం కట్టివాలనీ, 55 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే తమ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మాట మరిచిందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ అటకెక్కిందన్నారు. వ్యవసాయ కార్మిక సమస్యలను పరిష్కరించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఎన్నోఏండ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరచడంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి వేతనాలు చెల్లించడకపోవడం దారుణమన్నారు. జీఎస్టీ పేరుతో నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతుండటంతో పేదలు అల్లాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయడం ద్వారానే విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం(అమృతా ఎస్టేట్స్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం(జవహర్నగర్) రాష్ట్ర సీనియర్ నాయకులు జంగారెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, అధ్యక్షులు ధర్మానాయక్, బీకేఎమ్యూ రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మూఢ్ శోభన్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.