Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు అడుగుతామనే సెమినార్‌కు మంత్రులు దూరం
- అడ్డుకునేందుకు ఎస్ఎఫ్ఐ యత్నం..
- నాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
నవతెలంగాణ-నిజామాబాద్
తెలంగాణ యూనివర్సిటీ కి నిధులు లేవని చెబుతూ.. త్రీ స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ పెట్టడం ఎంతవరకు సబబు అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి ప్రశ్నించారు. టీయూకు రూ.200 కోట్లు కేటాయిస్తానని ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు కేటాయించలేదని, తాము ఎక్కడ నిలదీస్తామనే భయంతోనే మంత్రులు సెమినార్‌కు దూరంగా ఉన్నారని విమర్శించారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ నగరంలో సెమినార్ జరుగుతున్న హోటల్ ఎదుట సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను ఈడ్చుకుపోయి అరెస్ట్ చేసి 4వ టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తాటికొండ రవి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ విశ్వవిద్యాలయం బడ్జెట్ లేక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ఆర్మూర్ సభలో స్వయంగా సీఎం కేసీఆర్ యూనివర్సిటీకి రూ.200 కోట్ల బడ్జెట్ ఇచ్చి అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిచ్చి అర కొర నిధులను కేటాయించి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న సగం ప్రొఫెసర్ పోస్టులను ఎనిదేండ్లుగా భర్తీ చేయకపోవడం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు షిండే లత మాట్లాడుతూ.. యూనివర్సిటీకి అదనంగా గర్ల్స్ హాస్టల్ లేక విద్యార్థినీలు ఇబ్బందులు పడుతుంటే వైస్ ఛాన్స్లర్ ఇంటర్నేషనల్ సెమినార్ పేరుతో నిధులను దుర్వినియోగం చేయడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూనివర్సిటీకి అదనంగా గర్ల్స్ హాస్టల్‌ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాచకొండ విగేష్, బోడ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు పి మహేష్, తలరే సంజరు, నాగరాజు, సహాయ కార్యదర్శులు విశాల్, జిల్లా కమిటీ సభ్యులు ఉదరు, జవహర్, గణేష్, నాయకులు రాజేష్, మనితేజ, శేషు, లక్ష్మణ్, సురేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.