Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాచం కృష్ణమూర్తి గొప్ప ప్రజా నాయకుడని రైతు సంఘం సీనియర్ నాయకులు జంగారెడ్డి కొనియాడారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కృష్ణమూర్తి 16వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపట్టానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములుతో కలిసి ఆయన పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం జంగారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వ్యవసాయకూలీలకు అండగా నిలబడి, పేదలకు భూములను పంచిన కృష్ణమూర్తి రాగన్నగా సుపరిచితులుగా పేరు పొందారని గుర్తుచేశారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం పేదల పక్షాన నిలబడి పోరాడి విజయం సాధించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అనంతరెడ్డి ఓ సందర్భంలో తమ గ్రామంలో సభపెట్టి మరీ తాను గెలిచింది రికార్డుల్లోనే ఉంటుంది కానీ, కృష్ణమూర్తి ప్రజల మనస్సుల్లో గూడు కట్టుకున్న గొప్ప నేత అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్, పీఎన్ఎమ్ రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.శోభన్, మహిళా కూలీల కన్వీనర్ బి.పద్మ, ఐద్వా సీనియర్ నేత ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.