Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రామస్వామి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గర్బిణీకి చేసే పరీక్షల్లో పిండస్థ శిశువులో లోపాలుంటే అలాంటి తల్లులు శస్త్రచికిత్స అందుబాటులో ఉన్నచోట ప్రసవానికి వెళ్లాలని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రామస్వామి సూచించారు. హైదరాబాద్ లక్డికాపూల్లోని లోటస్ ఆస్పత్రిలో బహుళ లోపాలతో జన్మించిన జనార్థన్, స్వప్న దంపతుల కూతురుకు చికిత్స పూర్తి చేసి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామస్వామి మాట్లాడుతూ, నెలలు నిండక ముందే జన్మించిన నవజాత శిశువులో ఆహారాన్ని తీసుకెళ్లే పైపు కింద వరకు ఉండకుండా తెగిపోయి ఉండటం, ఛాతీలో ఎడమ వైపు ఉండాల్సిన రక్తనాళాలు (బ్లడ్ వెసల్స్) కుడివైపున ఉండటం, కడుపు క్రింద వరకు వెళ్లకుండా మధ్యలో పాంక్రియాసిస్ పైపును చుట్టుకోవడం తదితర లోపాలున్నాయని తెలిపారు. చాలా అరుదుగా ఇలాంటి పిల్లలు జన్మిస్తారని చెప్పారు. శిశువుకు ఏకకాలంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేశామనీ, అలా చేయడం కూడా అరుదని తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడం అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక సౌకర్యాలున్న చోటే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూబార్న్ డిసీజెస్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ వి.ఎస్.వి.ప్రసాద్, ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ షేక్ జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు..