Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాపై ఉక్కుపాదం
- పీఎస్ ఎంహెచ్ కొరటాల లాంటి వారి త్యాగాలతో నిలబడ్డ పత్రిక
- కలమే ఆయుధంగా ముందుకు : నవతెలంగాణ ఏడో వార్షికోత్సవంలో సంపాదకులు ఆర్ సుధాభాస్కర్
- సిబ్బందే అసలైన పెట్టుబడి : సీజీఎం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ ఎనిమిదేండ్ల పాలనలో పత్రికా స్వేచ్ఛ హననమైందని నవతెలంగాణ సంపాదకులు ఆర్ సుధాభాస్కర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని మోటూరు హనుమంతరావు భవన్లో నవతెలంగాణ ఏడో వార్షికోత్సవ సభ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుధాభాస్కర్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాతో పాటు ప్రశ్నించే సంస్థలు, రచయితలు, కళాకారులపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఎనిమిదేండ్లలో ఒక్క సారి కూడా మీడియా సమావేశం పెట్టని ప్రధాని ప్రపంచంలో బహుశా మోడీ ఒక్కరేనని తెలిపారు.ప్రజాస్వామిక వ్యవస్థను మార్చి, దాని స్థానంలో నియంతృత్వంతో కూడిన శాశ్వత కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భావిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చిత్రకారులు, ప్రజాస్వామిక వాదులు, హక్కులడిగే వారిని జైళ్ళల్లో నిర్భంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. చైతన్యయుత భారత్‌ను నిర్మించేందుకు పెన్నే ఆయుధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూడా నవతెలంగాణ పత్రిక గొంతు నులిమేందుకు ప్రయత్నం జరిగిందని గుర్తుచేశారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని అది ముందుకు పోతున్నదని తెలిపారు.ప్రభాకర్ మాట్లాడుతూ నవతెలంగాణ అవిర్భవించి ఏడేండ్లే అయినా..దీని పునాది స్వాతంత్య్రానికి ముందే పడ్డదని వివరించారు. 1942లో ఏర్పడ్డ ప్రజాశక్తి ఎన్నో నిర్భందాలను ఎదుర్కొన్నదని తెలిపారు.నిర్భంధాలను, నిషేదాలను అధిగమించి సమసమాజంకోసం నిర్విగంగా కొనసాగుతున్నదన్నారు. ఇది కార్పొరేట్ శక్తుల పెట్టుబడులతో నడిచే పత్రిక కాదనీ, ప్రజల కోసం ప్రజలే నడిపిస్తున్న పత్రికనీ, దీని కోసం నిస్వార్దంగా పనిచేసే సిబ్బందే అసలైన పెట్టుబడని చెప్పారు. పీఎస్, ఎంహెచ్,కొరటాల లాంటి వారి త్యాగాల పునాదుల మీద, వారు ఆశించిన సమాజ నిర్మాణం కోసం పత్రిక, దాని సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఆటుపోట్లు ఎదురైనప్పుడు సిబ్బందంతా ఏకోన్ముఖంగా పట్టుబట్టి నవతెలంగాణను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో కూడా మెరుగైన పద్దతుల్లో పత్రికను నడిపిస్తామని చెప్పారు.
హెచ్ఆర్ విభాగం జనరల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ నవతెలంగాణ మహత్తర లక్ష్యం కోసం పనిచేస్తున్న పత్రికని చెప్పారు. పాలవర్గాలు తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టటం, చీలికలు తీసుకురావటంతో తమ పాలనను పదిలం చేసుకుంటారనీ, దీన్ని బట్టబయలు చేయటమే ఈ పత్రిక లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఎ వెంకటేశ్, లింగారెడ్డి, ఆర్ వాసు, బోర్డు సభ్యులు బీవీఎన్ పద్మరాజు, బి బసవపున్నయ్య, వేణుమాధవ్,నరహరి తదితరులు పాల్గొన్నారు.