Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్య సమస్యే కారణం
- నందమూరి కుటుంబంలో విషాదం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో/జూబ్లీహిల్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ (నాలుగో) చిన్న కూతురు అనారోగ్య సమస్యతో బాధపడుతూ సోమవారం మృతిచెందారు. అనారోగ్య సమస్యతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కంఠమనేని ఉమామహేశ్వరి(52) అందుకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురైన ఉమామహేశ్వరి, ఆమె భర్త డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు విశాల, దీక్షిత. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఉమామహేశ్వరి ఎంతసేపటికీ బయటకు రాలేదు. భోజనం సమయం అయినా బయటకు రాకపోవడంతో కుమార్తె దీక్షిత తలుపులు తట్టారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గది తలుపులు తీసిచూడగా ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీక్షిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తికావండంతో మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి తరలించారు. ఉమామహేశ్వరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కండ్లను దానం చేశారు.
దిగ్భ్రాంతికి లోనైన ఎన్టీఆర్ కుటుంబం
ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్, కల్యాణ్రామ్తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్నారు. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉంటోంది. ఇటీవల ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇంట్లో నలుగురమే ఉన్నాం: దీక్షిత
అనారోగ్య సమస్యలతోనే అమ్మ ఆత్మహత్య చేసుకుందని చిన్నకూతురు దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగుర మే ఉన్నామని తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.
సంతాపం తెలియజేసిన టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
ఉమామహేశ్వరి ఆత్మహత్యపై టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్‌గౌడ్, పెద్దోజు రవీంద్రాచారి తదితరులు ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.