Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె
నవతెలంగాణ-విలేకరులు
ఉద్యోగ భద్రత కల్పించాలని, పే స్కేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న దీక్షలు సోమవారం కొనసాగాయి. పలు జిల్లాల్లో వీఆర్ఏలు దీక్ష శిబిరాల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా వంటావార్పు నిర్వహించారు. పలు రాజకీయపార్టీలు సంఘీభావం తెలిపారు. ఖమ్మం జిల్లాలో స్వయంగా వీఆర్ఏలే కూరగాయలు కట్ చేసి భోజనాలు తయారు చేశారు. కామేపల్లి, కూసుమంచిలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన లబ్దిదారులకు భోజనం వడ్డించి తమ బాధలను వివరించారు. బోనకల్లో టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. వేంసూరులో సీపీఐ(ఎం) నాయకులు సంఘీభావం తెలిపారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్టీపీ నాయకులు నరాల సత్యనారాయణ మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ములకలపల్లిలో కాంగ్రెస్ నాయకుల సంఘీభావం తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెకు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. వీఆర్ఏల శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. నాగారం, అర్వపల్లిలో సమ్మెకు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీపీసీసీ సభ్యులు గుడిపాటి నర్సయ్య వేర్వేరుగా సంఘీభావం తెలిపారు.