Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మీకు కమీషన్లు వచ్చే అవకాశం ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల కోసం బరితెగించి ఢిల్లీలో లాబీ చేయడమేంటని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇదేం పద్దతంటూ నిలదీశారు. కాంట్రాక్టర్ల కోసమే సీఎం ఢిల్లీ వెళ్లి రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని విమర్శిం చారు. రైతులు, ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కేవలం తన సన్నిహిత కాంట్రాక్టర్ల బిల్లుల కోసం సిగ్గూ, ఎగ్గులేకుండా వారం రోజులు ఢిల్లీలో చీకటి ప్రయత్నాలు చేయడం అత్యంత దారుణమని తెలి పారు. ఈమేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. గత వారం రోజులుగా మీరు ఢిల్లీలో మకాం వేసిన సీఎం ఏం సాధించారనీ, తిరిగి రాష్ట్రానికి వచ్చారనీ, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టంపై ఈ పర్యటనలో కేంద్రానికి నివేదిక సమర్పించి, సాయం కోరుతారేమోనని ఆశించామని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేదు కు అవసరమైన నిధులు, అప్పుల కోసం ప్రయత్నిం చడం విస్మయాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ రూ. 498 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ రూ. 449 కోట్లు, సాగునీటి శాఖ రూ.33 కోట్లు, పురపాలక శాఖ రూ.379 కోట్లు, విద్యుత్ శాఖ రూ. ఏడు కోట్లు కలిపి సుమారు రూ.1400 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు వేసిన అధికారులు కేంద్రానికి ఓ తూతూ మంత్రపు నివేదిక పంపి చేతులు దులుపు కున్నారని విమర్శించారు. కానీ, అత్యంత కీలకమైన పంట నష్టంపై మాత్రం అంచనాలు వేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నివేదికలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించా రు. నష్ట అంచనాలను లెక్కకట్టడంలో సాధారణంగా పాటించే ప్రమాణా లు పాటించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కేంద్రానికి పంపిన నివేదికలో పంట నష్టం అంశమే లేదని పేర్కొన్నారు. సంబందిత న్యూమరేషన్కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని విమర్శించారు. మూడేండ్లుగా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. బీజేపీ సర్కారు గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నా ...జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు, మూడు వ్యవసాయ చట్టాలు వంటి కీలక అంశాలకు కేసీఆర్ మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో గిరిజన, బీసీ గురు కులాల్లో కలుషిత ఆహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రి పాలౌవుతున్నారని పేర్కొ న్నారు. కానీ సీఎం మనుమడు ఏ సన్నబియ్యం తింటున్నాడో అదే ఆహారాన్ని పేద పిల్లలకు పెడుతున్నామంటూ ఊరువాడా తిరిగి చెప్పారంటూ ఎద్దేవా చేశారు. కలుషిత ఆహారం తిని పేద విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఒక్కనెలలోనే అనేక ఘటనలు జరిగాయని వివరించారు. నష్టపోయిన పంటకు ఎకరాకు కనీసం రూ.20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికే నేరుగా పరిహార మివ్వాలని కోరారు. వాణిజ్య పంటలకు రూ 50వేల పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబా లకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ, పశువులను కోల్పోయిన కుటుంబాలకు పరిహారంతో పాటు ప్రభుత్వ బ్యాంకులు, ప్రయివేటు అప్పులపై రెండేండ్లపాటు మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు.
ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి రేవంత్, భట్టి సానుభూతి
హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గానికి చెందిన తన ఆప్త మిత్రుడు ఫిరోజ్‌ఖాన్ కూతురు తానియా అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సా నుభూతి తెలిపారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న తానియా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం అత్యంత దురదష్టకరమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యావసరాలకు నిరసనగా 5న ధర్నాలు
- పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుదలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్ తదితర సమస్యలపై ఆందోళనలు చేపట్టనున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వివరించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఆయా అంశాలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వరదలతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.