Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ అసిస్టెంట్ హోదాలో పోస్టింగ్‌లు
- జిల్లాల్లో ఖాళీలు లేకుంటే పక్క జిల్లాలకు కేటాయింపు
- నేటి మధ్యాహ్నం లోగా కేటాయించిన ఉద్యోగాల్లో చేరాలని ఆదేశం
- భగ్గుమంటున్న రెవెన్యూ సంఘాలు
- న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం : వీఆర్వో జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణలో, ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన వీఆర్వోల శకం ముగిసింది. ఆ వ్యవస్థను 22 నెలల కిందటే రద్దు చేసిన రాష్ట్ర సర్కారు వారిని ఇప్పుడు ఆయా శాఖల్లోకి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. సోమవారం లక్కీడ్రా ద్వారా ఆయా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లకు సమాన స్థాయిలోని పోస్టులకు ఎంపికచేసింది. మంగళవారం మధ్యాహ్నం వరకు పోస్టింగ్‌లో చేరాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో నెంబర్ 121ని విడుదల చేశారు. అయితే, ఈ జోవో అధికారికంగా జూలై 23న విడుదలైనప్పటికీ రాష్ట్ర సర్కారు విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. పనంతా గుట్టుచప్పుడు కాకుండా లోలోన కానిచ్చేసింది.
రెవెన్యూ శాఖ మినహా పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటిపారుదల, రవాణా, సివిల్ సప్లరు, వైద్యారోగ్య, విద్య, హోం, ఇండ్రస్టీస్, ఇరిగేషన్, లేబర్, వ్యవసాయ, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమం, అటవీ, ఆర్థిక, హౌం, మహిళా, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, తదితర శాఖల్లోకి వీఆర్వోలను సర్దుబాటు చేశారు. విద్యార్హతలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా లాటరీ పద్ధతిన ఎంపిక చేసి పోస్టింగ్‌లు కేటాయించారు. అధికారుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆర్థిక శాఖ కార్యదర్శి డి. రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో లాటరీ ద్వారా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు అధికా రులు గోప్యత పాటించారు. సెలవు, సస్పెన్షన్‌లో ఉన్నవారికి కూడా జిల్లా కేటయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక జిల్లాలో పోస్టులు లేకుంటే పక్క జిల్లాలోనైనా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు.
సమ్మెలోకి వెళ్తాం..రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను బయటపెడతాం
లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
' సర్కారు 15 రోజుల్లో 121 జీవోను రద్దు చేయాలి. లేకపోతే రెవెన్యూ ఉద్యోగులమంతా సమ్మెలోకి వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అనాథను చేసింది. ఏదో సాధిస్తామని ధరణి వెబ్సైట్ తెచ్చి అబాసుపాలవుతున్నది. ఇప్పటికీ పుంకాను పుంకాల ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. అన్నీ బయట పెడతాం.. ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీయగలం. ఎన్నికల సమయంలో మా సత్తా చాటుతం. వేలాది పోలింగ్ స్టేషన్లు మా చేతుల్లోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని కూలదోయడంలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. జీవోను రద్దు చేయకపోతే మా సత్తా ఏంటో చూపుతాం' అంటూ తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణి విషయంలో ఐఏఎస్ కూడా కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆధార పడుతున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం ధరణి ద్వారా అందర్నీ వేలిముద్ర వేసేవాళ్లుగా తయారుచేసిందని విమర్శించారు. వీఆర్వో వ్యవస్థను ఉంచాలనే డిమాండ్‌తో సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహా అయితే ఏసీబీ, ఇతర సంస్థలతో దాడులు చేయించడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగస్తులను ఉద్యోగంలో నుంచి పీకగలదా? రాష్ట్ర ప్రభుత్వానికి అంత దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు. ధరణి వచ్చాక ఆర్డీఓ, తహసీల్దార్లు, కలెక్టర్ల అధికారాల్లో కోతపడిందనీ, దీనిపై మిగతా రెవెన్యూ ఉద్యోగులు ఎందుకు చప్పుడు చేయడం లేదని ప్రశ్నించారు. రెవెన్యూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తాను ఉద్యోగానికి రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేడు వీఆర్వోలు, వీఆర్ఏలకు జరుగుతున్న అన్యాయమే మిగతా వారికీ జరిగే ప్రమాదం ఉందనీ, వీఆర్వో వ్యవస్థ రద్దుతో పనిభారం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు అన్ని సంఘాలూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ వ్యవస్థకు వీఆర్వోలు మూలస్తంభాలు..రెవెన్యూలో ఉంచాలి
గౌతం కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రెవెన్యూ వ్యవస్థకు వీఆర్వోలు మూలస్తంభాల లాంటి వారు. వారు లేకపోతే రెవెన్యూ శాఖకే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. కలెక్టర్లు ఆర్డీఓలు ఏ ఆదేశాలు జారీచేసినా క్షేత్రస్థాయిలో ఏ ఫీల్డ్ విజిట్ అయినా చేసేది వీఆర్వోలే. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి చేరేలా చేయడంలోనూ, ధ్రువీకరణ పత్రాల జారీకి నిరార్ధణ చేయడంలోనూ వీరే కీలకం. వారే లేకపోతే తీవ్ర పనిభారం పెరిగే ప్రమాదముంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. రెవెన్యూ శాఖలో చాలా సిబ్బంది అవసరం. వారిని రెవెన్యూలోనే కొనసాగించాలి. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి.
న్యాయపోరాటం చేస్తాం..ఎన్హెచ్ఆర్సీకి వెళ్తాం. : గోల్కొండ సతీశ్, వీఆర్వో సంఘాల జేఏసీ చైర్మెన్
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. రెవెన్యూ శాఖలో సరిపోను సిబ్బందే లేరు. మస్తు ఖాళీలున్నారు. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగాదు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి. వీఆర్వోలను వేరే శాఖలకు బదిలీ చేయడం వల్ల అనేక న్యాయ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అవన్నీ సర్కారు మెడకే చుట్టుకుంటాయి. టీఎస్పీఎస్సీ ద్వారా నియమితులైన వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం అన్యాయం. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. న్యాయపోరాటానికి సిద్ధమవుతాం. ఎన్హెచ్ఆర్సీకి వెళ్తాం.
సర్వీసు ప్రొటెక్షన్, సీనియారిటీ తేల్చకుండా సర్దుబాటు సరిగాదు
వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి.ఉపేందర్‌రావు
సర్వీస్ ప్రొటెక్షన్, సీనియారిటీ తేల్చకుండా వేరే శాఖల్లోకి తమను బదిలీ చేయడం సరిగాదు. పదోన్నతుల అంశంపై ఎక్కడా ప్రస్తావించలేదు. అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిపరిస్థితుల్లో విధుల్లో చేరుతాం. కానీ, తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తాం.