Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంతో పేదలకు నష్టం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసింది. ప్రజల ఉపాధిని దెబ్బతీసింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపయోగంగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా సర్క్యూలర్ జారీ చేయడం దుర్మార్గం. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి' అని కోరుతూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. 'ఆ సర్క్యూలర్‌తో రాష్ట్రంలోని 57.46 లక్షల జాబ్ కార్డ్స్ కలిగిన 1,21,33,000 మంది ఉపాధి హమీ కూలీల హక్కులకు నష్టం కలుగుతుంది. కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు ఉపాధి హామీ చట్టంపై అవినీతి ముద్ర వేసి రద్దు చేసే ప్రయత్నాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది సరిగాదు' అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు పదివేల కోట్ల రూపాయల కూలీల వేతనాలు పెండింగ్ ఉన్నాయని కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పడం నిజం కాదా? తెలంగాణకూ చెల్లించాల్సి ఉందని అంగీకరించడం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. 2017-18లో జరిగిన ఎకనమిక్ సర్వేలో యూనివర్సిల్ బేసిక్ ఇన్‌కమ్‌ను ప్రతిపాదించింది మీ ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. ఆ సర్వే ప్రకారం దేశంలో 30 శాతం కుటుంబాలకు ఏటా 72 వేల రూపాయల ఆదాయం కల్పించే చర్యలేవీ? ఉపాధి హమీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అర్థం పర్థంలేని నిబంధనలతో నిధుల్లో కోత పెట్టి యూబీఐని ఎలా అమలు చేస్తారు? అని అడిగారు. ఎండాకాలంలో పనిప్రదేశం నుంచి ఉదయం 10 గంటలలోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఫొటోలు దిగి, అప్ లోడ్ చేసి కచ్చితంగా 8 గంటలు పనిచేయాలని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. రూ.257తో ఆ కూలీలకు నిజంగా జీవనోపాధి లభిస్తుందా? అని ప్రశ్నించారు. చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ వస్తుంటే దాన్ని నిర్వీర్యం చేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వానికి తగునా? అని నిలదీశారు. ఉపాధి కూలీలను క్రమంగా ఈ చట్టానికి దూరం చేసే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడి ద్వితీయ స్థానంలో ఉన్నవారిని ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని పేర్కొనడం దారుణమని పేర్కొన్నారు. ఓడిపోయిన ప్రజా ప్రతినిధులను వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ఎప్పటికప్పుడు కూలీలు చేసే పని సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని సర్క్యూలర్‌లో పేర్కొనటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఈ నిబంధన కూలీలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా విమర్శించారు. అధికారులు చేయాల్సిన పనిని వారికి అప్పగించడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ ద్వారా గ్రామంలో 20 పనులు మాత్రమే చేపట్టాలని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ నిర్ణయాలను తెలంగాణ బిడ్డగా ఎలా సమర్థిస్తారని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.