Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన
- కనీసవేతనాల జీవోల విడుదల కోసం మహాధర్నా
- అసంఘటిత కార్మికుల వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటుకు డిమాండ్
- వేలాదిగా తరలిరానున్న కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో పాలకవర్గాలు మారాయి..ఆ తర్వాత రాష్ట్రాలూ విడిపోయాయి... కొత్తరాష్ట్రమూ సిద్ధించి ఎనిమిదేండ్లవుతుంది..ప్చ్ ఏం ప్రయోజనం. జెండాలు వేరైనా కార్పొరేట్లకు ఊడిగం చేయడమే మా ఎజెండా అనే విధంగా ఉన్న పాలకుల తీరు మారలేదు. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను విడుదల కాకుండా తొక్కిపెడుతున్నారు. రాష్ట్ర సర్కారుపై నయాపైసా భారం పడకున్నా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కొమ్ముకాస్తూ యాజమాన్యాలు చెప్పినట్టు ముందుకెళ్తున్నది. స్వరాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని తెగించి కొట్లాడిన అసంఘటిత కార్మికులకు నిరాశే మిగింది. వేతనాలు పెరగకపోగా..దొడ్డిదారిన 12 గంటల పనివిధానం అమలవుతున్న దుస్థితి నెలకొంది. కార్మికుల భద్రతకు రక్షణ లేకుండా పోయింది. వినతులిచ్చినా...వేడుకున్నా...రాష్ట్ర సర్కారులో చలనం లేకపోవడంతో కనీస వేతనాల జీవోల విడుదల, అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సీఐటీయూ బుధవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు కార్మిక ప్రదర్శన చేపట్టనున్నది. అనంతరం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి కార్మికలోకం పెద్దఎత్తున తరలిరానున్నది. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌తో పాటు ఆఫీస్‌బేరర్లు పాల్గొననున్నారు. కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం ఐదేండ్లకోసారైనా వేతనాలను సవరించాలి. కానీ, రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్లలో కాలపరిమితి ముగిసిన కనీస వేతనాల జీవోలను ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర సర్కారు విడుదల చేయడం లేదు. ఇతర ట్రేడ్ యూనియన్లను కలుపుకుని సీఐటీయూ అనేక పోరాటాలు చేసిన ఫలితంగా సెక్యూరిటీ సర్వీసెస్, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల నిర్మాణాలు, ప్రాజెక్టులు, డ్యామ్‌లు, స్టోన్ బ్రేకింగ్, స్టోన్ క్రష్షింగ్ రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ, వాటిని గెజిట్ కాకుండా యజమానుల సంఘాలు అడ్డుకున్నాయి. లేబర్ కోడ్లు రాకముందే నూటికి 90 శాతం కంపెనీల్లో 12 గంటలకుపైగా పనివిధానం అమలవుతున్నది. పర్మినెంట్, కాంట్రాక్టు, ట్రైనీలు, అప్రెంటీస్‌లు, లాంగ్‌టర్మ్, ఫిక్స్డ్టర్మ్, ఔట్సోర్సింగ్, దినసరి కూలీలుగా కార్మికులను విడగొట్టి శ్రమను దోచుకుంటూ పరిశ్రమలు లాభాలను గడిస్తున్నాయి. చాలా పరిశ్రమలు యూపీ, బీహార్, ఒడిశా, బెంగాల్, చత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు, 5 లక్షల మంది హమాలీ కార్మికులు, 7 లక్షల మంది బీడీ కార్మికులు, 16 లక్షల మంది ట్రాన్స్‌పోర్టు రంగం కార్మికుల సమస్యలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవట్లేదు. వారికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌నూ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే కార్మికులను సంఘటితం చేసి సీఐటీయూ పోరాటాలు చేస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది.