Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డులు నిలిపేత
- బకాయిలు రూ.24 వేల కోట్లు
- సాంకేతిక లోపం వల్లే నిలిపివేత : అధికారులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఆధునిక వైద్య రంగంలో హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)కు పెట్టింది పేరు. గుండె, కిడ్నీ చికిత్సకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. దీంతోపాటు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చికిత్సల కోసం పేద, మధ్య తరగతి రోగులు ఇక్కడికి వస్తారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీమ్(జేహెచ్ఎస్) కార్డులు సైతం ఒక్క నిమ్స్‌లోనే చెల్లుబాటు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని మంగళవారం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను బంద్ చేశారు.
నిమ్స్‌లో గుండె, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, గైనకాలజీ, ఇతర ప్రధాన రోగాలకు చికిత్స అందిస్తున్నారు. దీంతోపాటు క్యాన్సర్ సెంటర్ కూడా ఉంది. ప్రయివేటు కార్పొరేట్ ఆస్పత్రుల తర్వాత నిమ్స్కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు, ప్రముఖులకు ఇక్కడే ఎక్కువగా చికిత్స అందిస్తున్నారు. అందుకు ప్రముఖ డాక్టర్లు, నిపుణులు ఉండటమే ప్రధాన కారణం. కానీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులు రావడం లేదంటూ కార్డులు పనిచేయవని నిమ్స్ యాజమాన్యం చెప్తోంది.
రోజుకు 2 వేలపైనే..
నిమ్స్‌కు రోజూ దాదాపు రెండు వేలమందికిపైనే రోగులు వస్తుంటారని ఆస్పత్రి వర్గాల అంచనా. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. అవుట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు రకరకాల ఇబ్బందులు తప్పడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇక్కడ చెల్లడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈహెచ్ఎస్ కార్డులు మాత్రం చెల్లుతున్నాయని, సంబంధిత రోగానికి చికిత్సకు వర్తించకపోతే డబ్బులు చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. 1000 పడకల ఆస్పత్రి కావడంతో ఇన్‌పేషెంట్లు అధికంగానే ఉన్నారు. రోజుకు కనీసం 1000 రోగులు వస్తుంటారని, అత్యధికంగా 2 వేలపైనే ఉంటారని అధికారులు చెబుతున్నారు.
'ఆర్యోగ శ్రీ'పై చిన్నచూపు
కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీతో విసుగుచెందిన చాలా మంది నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లబ్దిదారులు కూడా వస్తారు. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రెక్కడితేకాని డొక్కాడని పేదలు ఏదైనా జబ్బు చేస్తే లక్షల్లో చెల్లించుకోలేని పరిస్థితుల్లో అందుబాటులోని ఆస్పత్రులతోపాటు నిమ్స్‌కు వస్తారు. దీంతో నిమ్స్‌కు వచ్చే ఆర్యోగశ్రీ పేషంట్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో సరిపడా పడకలు లేక రెండు మూడ్రోజులపాటు వైద్యం అందక వార్డుల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు ఆర్యోగశ్రీ కార్డు లబ్దిదారుల పట్ల యాజమాన్యం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. ఇదిలావుంటే చిన్న చిన్న రోగాలకు కూడా పేసెంట్లు నిమ్స్‌కు వస్తున్నారని, దగ్గరల్లోని ఆస్పత్రికి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డుదారులంటే పరిస్థితి వేరేగా ఉంటుందని పలువురు బాధితులు చెబుతున్నారు.
బకాయిల పేరుతో..
ముఖ్యంగా జేహెచ్ఎస్ కార్డులకు వెల్నెస్ సెంటర్లలో నామమాత్రమైన చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందిస్తుందంటే నిమ్స్‌లోనే. ఆరోగ్యశ్రీతోపాటు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారుల చికిత్సలకు సంబంధించిన ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నిమ్స్‌కు సుమారు రూ.24 వేలకోట్ల బకాయిలు పేరుకుపోయాయని, అందుకు ఈ మూడు సేవలు నిలిపేశామని సిబ్బంది చెబుతున్నట్టు రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా సాంకేతిక సమస్య కారణంగానే సేవలు నిలిచిపోయాయని, ఇన్‌పేషెంట్స్ చాలా మంది ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులు ఉన్నారని తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.