Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోనే మొట్టమొదటి క్లినిక్
- ఎంజీఎం సూపరింటెండెంట్‌తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ గోపి
నవతెలంగాణ-మట్టెవాడ
ట్రాన్స్జెండర్లకు ఆరోగ్యపర మైన సమస్యలు తలెత్తితే వైద్యం కోసం న్యూఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, కానీ ఇప్పుడు రాష్ట్రంలోనే ఓ క్లినిక్‌ను ప్రారంభించుకున్నాం. ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రదాయునిగా పేరుపొందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. క్లినిక్ ను మంగళవారం వరంగల్ కలెక్టర్ బి.గోపి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రాన్స్ జెండర్ల కోసం 24 గంటలు పనిచేసే మొబైల్ నెంబర్ లోగోను వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంజీఎంలో పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 6000 మంది ట్రాన్స్ జెండర్ల కోసం వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడి ప్రభుత్వ అనుమతితో వరంగల్ ఎంజీఎంలోనే ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని కేటాయించినట్టు చెప్పారు. ప్రతి మంగళవారం వైద్య సేవలు అందుతాయని, ట్రాన్స్ జెండర్లు ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వారికోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఇక్కడ సైకియాట్రిక్, డెర్మటాలజిస్టులు, అందరూ అందుబాటులో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్, కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ దివ్వెల మోహన్ దాస్, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
క్లినిక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది : రాష్ట్ర అధ్యక్షురాలు లైలా
ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌ను వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు లైలా అన్నారు. తమకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే ఢిల్లీ వెళ్లి ఎంతో ఖర్చుతో కూడిన వైద్యం చేయించుకొని విసిగిపోయామని, లేజర్ చికిత్సలు, సర్జరీలో వ్యయ ప్రయాసలకు గురయ్యే వారమని తెలిపారు.