Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.70 వేలు, ఐదు సెల్‌ఫోన్స్ స్వాధీనం
- గొలుసుకట్టులా సాగిన విక్రయ ప్రక్రియ
- వివరాలు వెల్లడించిన ఎస్పీ
నవతెలంగాణ- నల్లగొండ
శిశుల విక్రయాలు జరుపుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.70 వేలు, ఐదు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.దేవరకొండ మండలం కొండభీమనపల్లి పంచాయతీ పరిధిలోని యెర్రబిచ్చియ తండాకు చెందిన రుదావత్ కవిత గత నెల 2న దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఆమె గత నెల 10వ తేదీన డిశ్చార్జ్ అయ్యి గ్రామానికి వెళ్లింది. ఆ తర్వాత వారి ఇంట్లో ఒక శిశువు కనిపించకపోవడంతో అదే నెల 20న ఆశావర్కర్ అలివేలు ఆరా తీస్తే విషయం బయటపడింది. అయితే, గతేడాది కూడా కవితకు పుట్టిన ఆడ బిడ్డను భర్త గోపి, అత్త రుదావత్ హస్లీ కలిసి రేపని అలివేలు- వెంకటయ్య దంపతులకు ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆశావర్కర్ అధికారులకు సమాచారం అందించి ఆడ శిశువును తీసుకుని నల్లగొండ శిశు గృహానికి తరలించారు. ఇటీవల కవిత మళ్లీ ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనివ్వగా.. ఒకరు కనిపించకపోవడంతో ఆశావర్కర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ నేనవత్ రాధాకు చెప్పారు. గత నెల 28న పోలీసులు కవిత కుటుంబీకులపె కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇరగదిండ్ల మాధవి హైదరాబాద్‌లోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన అర్బన్ కంపెనీలో హౌస్ క్లీనింగ్ పనులు చేస్తుంది. ఆమె స్నేహితుడైన బాలు దేవరకొండలో తన బంధువుల వద్ద దత్తత తీసుకోవడానికి ఒక ఆడ శిశువు ఉందని చెప్పాడు. ఆమె ఆ విషయాన్ని తన అన్న వల్లెపు శ్యామ్ (ఆటో డ్రైవర్)కు చెప్పింది. అయితే, శ్యామ్‌కు నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్న వేముల బాపురెడ్డి ×Vఖీ సెంటర్, పద్మజా హాస్పిటల్ హబ్సిగూడ హైదరాబాద్‌లో సంతాన సౌఫల్య కేంద్రం నడుపుతున్నాడు. పిల్లలు లేనివారు ఇక్కడ చికిత్స తీసుకుంటారు. అక్కడకు వచ్చినవారు పిల్లలు కాకుంటే దత్తత గురించి కూడా అడుగుతారు. అదే క్రమంలో ఎక్కడన్నా చిన్న పిల్లలు ఉంటే కొనేవారు ఉన్నారని వేముల బాపురెడ్డి శ్యామ్‌కు చెప్పాడు. గత నెల 11న శ్యామ్ బాపురెడ్డికి ఫోన్ చేసి దేవరకొండలో పది రోజుల ఆడ పిల్ల ఉందని, ఆమెను పోషించడానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేదని చెప్పాడు. ఆడ పిల్లను వేరేవారికి ఇస్తారని తన చెల్లెలు మాధవి చెప్పిందని బాపురెడ్డితో అన్నాడు. దాంతో బాపురెడ్డి యూసుఫ్‌గూడలో ఉండే కృష్ణవేణికి చెప్పాడు. ఆ విషయాన్ని ఆమె వరంగల్‌కు చెందిన చిర్ర మాధవి, ఆమె అక్క వసంతకు చెప్పింది. 12న వసంత, చిర్ర మాధవి, చిన్నారి అవసరం ఉన్న మంచిర్యాలకు చెందిన కుమ్మరి మల్లేష్- కుమ్మరి రజిత దంపతులు, రాజేష్, కుంభం సురేందర్ తదితరులు కలిసి చిన్నారికి బేరం కుదుర్చుకున్నారు. రూ.3లక్షలకు మాట్లాడుకున్నారు. ఆ దంపతుల నుంచి రూ.3లక్షలు తీసుకున్నాక.. చిర్ర మాధవి కృష్ణవేణికి రూ.2,60,000 ఇచ్చింది. ఆమె బాపురెడ్డికి రూ.1,80,000 ఇచ్చింది. ఆయన శ్యామ్‌కు రూ.1,60,000 ఇచ్చాడు. శ్యామ్ రూ.134000 మాధవికి ఇచ్చాడు. చివరకు పసికందు తండ్రి గోపి, నాయనమ్మ చేతికి రూ.80000 అందాయి. ఆ తర్వాత మల్లేష్ దంపతులు చిన్నారిని తీసుకుని మంచిర్యాలకు వెళ్లిపోయారు. అయితే, పసికందును చూడాలనుందని తల్లిదండ్రులు బతిమిలాడారు. బాపురెడ్డి, శ్యామ్, చిర్ర మాధవి, ఇరగదిండ్ల మాధవి మంగళవారం కుమ్మరి మల్లేష్- రజిత దంపతులతోపాటు పసికందును తీసుకుని హైద రాబాద్ నుంచి కొండమల్లేపల్లికి వచ్చారు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో బస్టాండ్ వద్ద కాపుకాశారు. ముందస్తు సమాచారంతో వారిని పట్టుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
సాంకేతికతో కేసు ఛేదింపు
ఐటీ కోర్ టీమ్ నిందితుల సిడిఆర్, టవర్ లొకేషన్‌ను ఎప్పటికప్పుడూ అందించింది. సరైన సాంకేతిక ఆధారాలతో నిందితులను 72 గంటల్లో పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, పోలీసు స్టేషన్ సిబ్బంది, ఐ.టి కోర్ టీమ్‌ను ఎస్పీ అభినందించారు.