Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ నెల పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియదు..
- ఏడాదికి ఒక నెలైనా ఎగవేస్తున్న ప్రభుత్వం
- సకాలంలో డబ్బులు రాక లబ్దిదారుల ఇక్కట్లు
- ఆగస్టు వచ్చినా అందని జూన్ నెల పింఛన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆసరా పింఛన్ సకాలంలో అందక.. అస్సలు ఎప్పుడు వస్తుందో తెలియక లబ్దిదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్క నెల కూడా నిర్ధిష్టమైన తేదీకి పడకపోవడంతో పింఛన్ ఆధారంగా బతుకుతున్న అనేక మంది జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఒక్కోసారి అస్సలు పింఛన్ పడని సందర్బాలూ ఉంటున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో రావాల్సిన పింఛన్‌ను మేలో 2, 28 తేదీల్లో రెండు విడతలుగా వేశారు. మేనెల పింఛన్ జూన్ 30వ తేదీన జమ చేయగా.. జూన్ పింఛన్ ఆగస్టు వచ్చినా ఇంకా పడకపోవడం గమనార్హం. ఇలా ఓ క్రమపద్ధతి లేకుండా పింఛన్ జమవుతుండటంతో లబ్దిదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. అంతేకాదు, పోస్టల్ ఖాతాదారులకు ఓ మూడు నాలుగు రోజులు ముందు, ఆ తర్వాత బ్యాంకు ఖాతాదారులకు పింఛన్ నిధులు జమవుతున్నాయి. ముఖ్యంగా ఈ పింఛన్‌పై ఆధారపడిన 45 లక్షలకు పైగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, హెచ్ఐవీ, పైలేరియా బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ కేటగిరీల కింద ఆసరా పెన్షన్ లబ్దిదారులు 2,47,144 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ.49 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వీరిలో ఖమ్మం జిల్లాలో 1,50,182 మందికి ప్రతినెలా రూ.30 కోట్ల వరకూ చెల్లించాలి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96,962 మంది లబ్దిదారులు ఉండగా వారికి ప్రతినెలా సుమారు రూ.21 కోట్ల వరకూ పింఛన్ అందించాలి. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఏఆర్టీ (ఎయిడ్స్ పేషెంట్లు), బోదకాలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఉన్నారు. అటు ఖమ్మం, ఇటు భద్రాద్రి జిల్లాల్లోనూ అత్యధికంగా ఉన్న 48,554+ 33,136 మొత్తం 81,690 మంది వృద్ధులకు నెలకు రూ.2016 చొప్పున రూ.16 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏ నెలలోనూ పింఛన్ సకాలంలో పడిన దాఖలాలు లేవు. ఒక నెల 2వ తేదీన వస్తే మరోనెల 22, 25, 30 ఇలా ఏరోజు పింఛన్ డబ్బులు ఖాతాలో పడతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది.
బడ్జెట్ లేమే కారణమా...?
బడ్జెట్ లేమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. చివరికీ ఉద్యోగులకు కూడా సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలోకి రాష్ట్రం నెట్టివేయబడిందంటున్నారు. పింఛన్దారులదీ అదే పరిస్థితని అంటున్నారు. 2020 మార్చిలో రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా వృద్ధుల పెన్షన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57కు తగ్గించారు. 2019-20లో ఆసరా పథకం కోసం రూ.9,402 కోట్లు కేటాయించగా 2020-21 బడ్జెట్లో రూ.2,356 కోట్లు పెంచి రూ.11,728 కోట్లు చేశారు. 2022-23 బడ్జెట్లోనూ దానినే కొనసాగించారు. అర్హత వయస్సును కుదించడంతో వృద్ధాప్య కేటగిరీలో అదనంగా ఏడు లక్షల మంది వచ్చి చేరారు. ఇలా ఈ పథకం లబ్దిదారుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువైంది. పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారు ఇంకా లక్షల్లో ఉన్నారు.
పింఛనే ఆసరా..
ఒక నెల పడకపోయినా ఆగమే..
ఒంటరి మహిళలైన తనకు నెలకు రూ.2016 పింఛన్ ఇవ్వాలి. కానీ ప్రతినెలా పింఛన్ రావట్లేదు. 55 ఏండ్లున్న నేను బయటకు పోయి ఏదైనా పనిచేద్దామన్నా ఆరోగ్యం సహకరి ంచట్లేదు. మా పాప ఆస్పత్రిలో పనిచేస్తే రూ.5000 జీతం ఇస్తారు. ఇంటి కిరాయి రూ.1500, రేషన్ సరుకులతో కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నాం. మాకు డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదు. ఇంటి కిరాయి, కరెంట్ బిల్లుకు నా పింఛన్ పోతుంది. మా అమ్మాయికి వచ్చే జీతంతోనే మేము బతకాలి. జులైలో పడాల్సిన జూన్ నెల పింఛన్ ఆగస్టు వచ్చినా పడలేదు. మేము ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి. ఒకనెల పింఛన్ పడకపోయినా మా బతుకులు ఆగమే.
- బ్రహ్మరౌతు లక్ష్మి, 39వ డివిజన్, ఖమ్మం
వారంలోపు పింఛన్ రావచ్చు
నేరుగా పింఛన్ నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమవుతుంటుంది. ఎంతమంది లబ్దిదారులున్నారో ప్రభుత్వానికి నివేదించాల్సినంత వరకే మా బాధ్యత. సాధారణంగా ప్రతినెలా పింఛన్ నగదు వస్తూనే ఉంటుంది. కాని గత నెల రావాల్సిన డబ్బులు ఇంకా జమకాలేదు. ప్రతినెలా పోస్టల్ ఖాతాదారులకు మూడు, నాలుగు రోజులు ముందు, ఆ తర్వాత బ్యాంకు ఖాతాదారులకు అమౌంట్ పడతాయి. గత నెల అందాల్సిన పింఛన్ మరో వారంలోపు రావచ్చని అనుకుంటున్నాం.
- విద్యాచందన, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి