Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాటల్లో కాదు.. చేతల్లో చూపెట్టాలి
- కార్మికకోడ్లను వ్యతిరేకించే దమ్ముందా?
- 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల సవరణ జీవోలు తీసుకొస్తారా!
- బీజేపీ విధానాలపై సీఎం కేసీఆర్ పోరాట చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి: సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ప్రదర్శన
- జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చిన కార్మికులు
బంగారు తెలంగాణ కాదు..బతుకు తెలంగాణ కావాలంటూ కార్మిక లోకం కదం తొక్కింది. అరుణ పతాకాలతో హక్కుల కోసం గర్జించింది. సీఐటీయూ ఆధ్వర్యంలో మహాధర్నా వరకూ ఎర్ర కవాతు నిర్వహించారు. కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్త్ను విధానాలపై నాయకులు కన్నెర్ర చేశారు. కార్మికులు, కర్షకులు స్వాతంత్య పోరాట కాలంలోనే పోరాడి సాధించుకున్న చట్టాలను నేటి మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదనీ, జీవించే హక్కును కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు .హక్కుల సాధనకు పోరే మార్గమంటూ నినదించారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నట్టు కేసీఆర్ తన గారడీ మాటలతో ప్రజల్ని నమ్మిస్తే సరిపోదనీ, తన చేతల్లో చూపెట్టాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. కనీస వేతనాల జీవోల కోసం జరుగుతున్న కార్మికుల పోరాటానికి కొండలాంటి ఎర్రజెండా అండదండగా ఉంటుందని హామీనిచ్చారు. ప్రపంచంలో కార్మికులు పోరాడి తమ హక్కులను సాధించుకున్నది మనం చూశామనీ, అదే దారిలో కార్మికులంతా ఐక్యంగా నిలబడండి.. పోరాడండి..తప్పకుండా గెలుస్తాం అని భరోసానిచ్చారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఇంటింటా మూడు రంగుల జెండా ఎగురేయాలని పిలుపునిచ్చారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సీపీఐ(ఎం) కూడా జాతీయపతాకం, ఎర్రజెండాలను ఎగురవేయబోతున్నదని చెప్పారు. అయితే, మోడీ, కేసీఆర్, సీపీఐ(ఎం) చెప్పేదేమిటనే విషయాన్ని ప్రతిఒక్కరూ అవగాహన చేసుకోవాలని సూచించారు. కనీస వేతనాల జీవోలు జారీ చేయాలనీ, అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. దారిపొడగూతా పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ కార్మిక దండు కదం తొక్కింది. నినాదాలతో గర్జించింది. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో తమ్మినేని మాట్లాడుతూ..కార్మికులు, కర్షకులు స్వాతంత్య పోరాట కాలంలోనే పోరాడి సాధించుకున్న చట్టాలను నేటి మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదనీ, జీవించే హక్కును కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పత్రికాస్వేచ్ఛను హరిస్తున్నదన్నారు. వీటన్నింటినీ ఎండగడుతూ ప్రజల్ని చైతన్యం చేయడంలో భాగంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయబోతున్నదని వివరించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పదవులొచ్చి బాగుపడింది తప్ప ప్రజల బతుకులు మారాయా? అని నిలదీశారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు..బతుకు తెలంగాణ కావాలని నొక్కిచెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులు, రైతులు, ప్రజల ప్రయోజనాలను ఏవిధంగా తాకట్టు పెడుతున్నాయి..చట్టాలను ఏవిధంగా ఉల్లంఘిస్తున్నాయి..స్వాతంత్య్ర పోరాటంలో మహనీయుల పోరాట స్ఫూర్తిని విడమర్చి చెబుతూ జాతీయ జెండాలను ఎగురవేస్తామన్నారు. సొంత రాష్ట్రంలో ధర్నాచౌక్‌తో పనుండదని కేసీఆర్ అంటే ఉద్యోగులు, ప్రజలు, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశపడ్డామనీ, కానీ, నేడు ఆందోళనలు చేయొద్దు, సభలు పెట్టొద్దు..ప్రశ్నించొద్దు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చివరకు ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే మళ్లీ పోరాటం చేసి సాధించుకున్నది ఎర్రజెండానేనని చెప్పారు. కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నామని మాటల్లో చెప్పటం కాదు చేతల్లో చూపెట్టాలని కేసీఆర్‌కు సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మికకోడ్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. తమది బీజేపీ లాంటి పార్టీ కాదు..తాము కార్మికుల పక్షమే అని 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించి కనీస వేతనాల జీవోలను విడుదల చేయగలగుతారా? అని అడిగారు. ఆ జీవోలను తీసుకొచ్చి తాము యాజమాన్యాల పక్షం కాదు..కార్మికుల పక్షమే అని నిరూపించుకుంటే అప్పుడు కేసీఆర్‌ను నమ్ముతామని వ్యాఖ్యానించారు.
కేసీఆర్..కేరళ ఎర్రజెండా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకో
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
కేరళలోని ఎర్రజెండా ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఇస్తున్నదనీ, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకుని ఇక్కడ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు కోరారు. 1980 వరకు పరిశ్రమలకు వచ్చే ఆదాయంలో ప్రతి వంద రూపాయలలో కార్మికులకు రూ.45 దక్కేదనీ, పెట్టుబడి, ఇతరత్రా ఖర్చులు, అన్నీ పోనూ యజామాన్యానికి రూ.15 లాభం మిగిలేదని వివరిం చారు. ఆ తర్వాత కార్మికులకు దక్కేది క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఎనిమిదేండ్లలో కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా మారాయన్నారు. కార్మికులకు వంద రూపాయలల్లో కేవలం రూ.11 మాత్రమే దక్కుతుందనీ, పెట్టుబడులు, ఇతరత్రా ఖర్చులు తీసివేస్తే యజమాన్యాలకు రూ.44 దక్కుతుందని తెలి పారు. పరిశ్రమ యజమా న్యాలు, బూర్జువా రాజకీయ పార్టీలు మిలాఖత్ అవ్వడం తో ఇలా జరుగుతు న్నదని చెప్పారు. పరిశ్రమల యాజమా న్యాలు ఇచ్చే డబ్బులను ఆ పార్టీలు ఎన్నికల్లో పంచి గెలుస్తున్నాయని విమర్శించారు. దీనిని అర్థం చేసుకుని కార్మికులు తమకు అనుకూలంగా ఏ పార్టీలు నిలుస్తున్నా యనే రాజకీయ చైతన్యాన్ని పెంపొందిం చుకోవాలని కోరారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలే పెంచుకుంటారా?..కార్మికులకు పెంచరా?
- జూలకంటి రంగారెడ్డి
ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతాలు పెంచుకుంటే సరిపోతుందా? కనీసం బతికేందుకు కూడా సరిపోక ఇబ్బంది పడుతున్న కార్మికులకు జీతాలు పెంచాలనే సోయి లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఐటీయూ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఒక్క పూట భోజనం ఖర్చు రూ.50 వేలు అవుతున్నదనీ, ఒక ప్రధాని ప్రజల సొమ్మును ఇలా ఎందుకు దుబారా చేస్తున్నారని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళారీ, కార్పొరేట్ ప్రభుత్వమనీ, అందుకే కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నదని విమర్శించారు.
కార్మికులకు టీఆర్ఎస్ ద్రోహం
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సీఐటీయూ పోరాడిన ఫలితంగా వచ్చిన ఐదు షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను కూడా కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల ఒత్తిడి మేరకు రాష్ట్ర సర్కారు తొక్చిపెట్టిందని విమర్శించారు. పరిశ్రమల యాజమాన్యాల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తున్నదన్నారు. పేదలకు 60 గజాల భూమి అడిగితే ఇవ్వని రాష్ట్ర సర్కారు పరిశ్రమలకు మాత్రం ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నదని చెప్పారు. ఆ పరిశ్రమల్లో కార్మిక చట్టాలు కూడా అమలు కావడం లేదని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలను కలుపుకుని ఐక్యపోరాటాలు చేస్తామని చెప్పారు.
రూ.176తో ఎట్ల బతుకుతరు?
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
పనిచేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అంత ఇస్తే సరి పోతుందని చెబుతున్నదనీ, తాము రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఇస్తున్నామని పరిశ్రమల యాజ మాన్యాలు వాదిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. కార్మిక కోడ్లు అమల్లోకి రాకముందే 12 గంటల పనివిధానం అమలవుతున్నదని విమర్శించారు. కనీస వేతనాల జీవోలను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేశారు.
మేమిద్దరం..మాకిద్దరు అన్నట్టుగా మోడీ, అమిత్‌షా తీరు
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
మేమిద్దరం.. మాకిద్దరు.. మాది చిన్న ఫ్యామిలీ.. మేమే ది చేసినా ఆ ఇద్దరి (అంబానీ, అదానీ) కోసమే చేస్తామన్నట్టుగా మోడీ, అమిత్‌షా వ్యవహరిస్తున్నారని
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య విమర్శిం చారు. కోటి మంది కార్మికులకు ప్రయోజనం కలిగే కనీస వేతనాల జీవోలను ఫైనల్ చేసే తీరిక సీఎం కేసీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు. కార్మిక శాఖ యజమానుల శాఖగా మారిందని విమర్శించారు.
ఈ మహాధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, కనీసవేతనాల బోర్డు సభ్యులు భూపాల్, బీసీడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు, తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ నాయకులను వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు పి.రాజారావు, జె.మల్లిఖార్జున్, కళ్యాణం వెంకటేశ్వర్రావు, మందా నర్సింహారావు, ఏజే రమేశ్, టి.వీరారెడ్డి, కార్యదర్శులు ఎం.వెంకటేశ్, బి.మధు, జె.చంద్రశేఖర్, బీరం మల్లేశ్, రాగుల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.