Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌కు పలు విశ్వవిద్యాలయాల విద్యార్థుల విజ్ఞప్తి
- త్రిపుల్‌ఐటీ బాసర, వర్సిటీలను సందర్శిస్తా : తమిళిసై హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్రిపుల్‌ఐటీ బాసరతోపాటు రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న తాము సమస్యలతో సతమతమవుతున్నామని అక్కడి పలు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్సిటీల చాన్సలర్, గవర్నర్ అయినా ఈ సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, త్రిపుల్‌ఐటీ బాసర విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. వారితో వివిధ అంశాలపై గంటపాటు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి విద్యార్థులు పలు సమస్యలను తీసుకొచ్చారు. త్రిపుల్‌ఐటీ బాసర విద్యార్థి మాదేశ్ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు ఇంకా అనారోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంత నష్టపోతున్నా ప్రభుత్వం, వీసీ క్యాంటీన్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కోరిన విద్యార్థులను సస్పెండ్ చేస్తామంటూ నోటీసులిస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ఓయూ నాయకులు సురేష్ యాదవ్ మాట్లాడుతూ వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులను ఎలుకలు కొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పందులు ఆటలాడుకుంటున్నాయని వివరించారు. సీఎం మనవడు ఏ సన్నబియ్యం తింటే హాస్టళ్లు, విద్యాసంస్థల్లో తినే విద్యార్థులూ అదే సన్నబియ్యం తింటారంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. త్రిపుల్‌ఐటీ బాసరలో కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని అన్నారు. ఏండ్ల తరబడి వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని విమర్శించారు. డొనేషన్ల పేరుతో బీటెక్ యాజమాన్య కోటాలోని సీట్లను కాలేజీలు అమ్ముకుంటున్నాయని వివరించారు. కేయూ విద్యార్థులు తిరుపతి, లోక్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. అయితే ఎనిమిదేండ్లుగా తమకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో లేని ఆంక్షలు ఇప్పుడు అమలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీల్లో నిరసన తెలిపే హక్కులేకుండా పోయిందని చెప్పారు. విశ్వవిద్యాలయాలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే గవర్నర్‌ను కలిశామన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల కావడం లేదని చెప్పారు.
నా శక్తిమేరకు కృషి చేస్తా : తమిళిసై
త్రిపుల్‌ఐటీ బాసరతోపాటు విశ్వవిద్యాలయాలనూ సందర్శిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థుల సమస్యలు, వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తన శక్తి మేరకు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మంచి ఆహారం నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరముందని సూచించారు. విద్యార్థులు ఉద్యోగాలు పొందే వారు కాకుండా ఉద్యోగాలిచ్చే వారిగా తయారు కావాలని కోరారు. 75 ఏండ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్‌ఘర్ తిరంగలో భాగంగా ఆన్లైన్లో వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. త్రిపుల్‌ఐటీ బాసరలో ఫుడ్ పాయిజన్ ఘటన తనను ఒక డాక్టర్‌గా కలిచివేసిందన్నారు. 75 కాలేజీలను సందర్శిస్తాననీ, అందులో త్రిపుల్‌ఐటీ బాసరకు వస్తానని హామీ ఇచ్చారు. హర్‌ఘర్ తిరంగ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యార్థులందరూ సోషల్ మీడియా డీపీలను మార్చుకోవాలనీ, జాతీయ జెండాను ఉంచాలని కోరారు.