Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.57 కోట్లతో నాలుగు స్కూళ్లలో ఆధునిక వసతులు
- రూ.7,289 కోట్లతో 'మన ఊరు-మనబడి' కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. 'మన ఊరు/బస్తీ - మన బడి' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వసతులు కల్పిస్తున్నది. రూ.3.57 కోట్లతో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నాలుగు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. రూ.7,289 కోట్లతో మూడేండ్లలో 26,065 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 'మన ఊరు/బస్తీ-మనబడి' కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఇందుకోసం రూ.7,289.54 కోట్లను కేటాయిం చింది. ఈ పనులతో రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమం ద్వారా నీటి సౌకర్యం తో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమత్తులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూడేండ్లలో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన జరగనుంది.
మొదటిదశలో రూ.3,497 కోట్లతో 9,123 స్కూళ్ల అభివృద్ధి
మొదటి దశలో 13 లక్షల మంది విద్యార్థులను చదువుతున్న 9,123 ప్రభుత్వ పాఠశాలలను రూ.3,497.62 కోట్లతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నీ పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా అమలుచేస్తారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి 40 శాతం నిధులు, పంచాయతీరాజ్, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో కొంత శాతం ఈ కార్యక్రమం అమలుకు వినియోగించనున్నారు. కార్పొరేట్ సంస్థల విరాళాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమకూర్చుతారు. రూ 3.57 కోట్ల నిధులతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ జెడ్పీహెచ్ఎస్, రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి జెడ్పీహెచ్ఎస్, హైదరాబాద్ జిల్లా గన్‌ఫౌండ్రిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మోడల్ ఆలియా, ప్రాథమిక, ఉన్నత పాఠశాల మహబూబియా (బాలికలు) 'మన ఊరు/బస్తీ-మన బడి' పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో ఆధునిక వసతులు, ఆకర్షనీయమైన గోడ చిత్రాలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతున్నాయి. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.