Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్ల కిందట నిర్వహణ ఆశావర్కర్లకు అప్పగింత
- ఒక్కో ఆశావర్కర్కు రూ.20వేల నుంచి 30 వేలు ఖర్చు
- ఇప్పటికీ బిల్లులు చెల్లించని ప్రభుత్వం
- పట్టించుకోని వైద్య, ఆరోగ్యశాఖ
- పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆశావర్కర్ల వినతి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నాలుగేండ్ల కిందట ప్రతి వ్యక్తికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం కంటివెలుగు ప్రాజెక్టును ప్రవేశ పెట్టింది. దీని నిర్వహణను ఆశావర్కర్లకు అప్పగించింది. గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన ఆశావర్కర్లు.. దీని కోసం ఒక్కొక్కరూ రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేశారు. అయితే ఆశావర్కర్లకు డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. అసలే అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. వెట్టిచాకిరికి గురవుతున్న ఆశాలపై కంటి వెలుగు ప్రాజెక్టు ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తమకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26వేల మంది ఆశావర్కర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,200 ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. ఒకవైపు పని ఒత్తిడితో అల్లాడుతున్న ఆశావర్కర్లకు ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టుల నిర్వహణ తలనొప్పిగా మారింది. 2018లో ప్రభుత్వం కంటి వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది. దీని నిర్వహణ ఆశావర్కర్లు చూస్తున్నారు. ఒక్కో గ్రామంలో నాలుగు నుంచి వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో సుమారు 20 మంది పని చేశారు. వారే ఒక్కొక్కరు సుమారు రూ. 20 నుంచి రూ.30 వేల వరకు తమ సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు సుమారు రూ.3.60 కోట్లు ఖర్చు చేశారు. ఈ డబ్బులు రెండు, మూడు నెలల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కనుమరగయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ ఆశావర్కర్ల బిల్లు చెల్లించలేదు. రాష్ట్రవ్యాప్తంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాంతో ఆశావర్కర్లు డబ్బులు లేక తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నారు. బిల్లుల కోసం ఎక్కడికి పోవాలో.. ఎవరిని అడగాలో తెలియక.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారి గోసను పట్టింకోవాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. ప్రాజెక్టుకు కాలం చెల్లిపోయిందని, తమకు రావాల్సిన డబ్బులకు కూడా కాలం చెల్లినట్లేనా.. అని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తూరు మండలం తిమ్మాపూర్ సెంటర్లో 5 మంది ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. 25 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కలిసి సుమారు 20 మంది పాల్గొన్నారు. వీరికి ఆశావర్కర్లే అన్నీ సౌకర్యాలు కల్పించారు.ఉదయం టీ మొదలు రాత్రి భోజనం వరకు ఒక్కో వ్యక్తిపై రోజు రూ.150 ఖర్చు చేశారు. ఈ లెక్కన రోజు రూ.3 వేల చొప్పున 25 రోజులకుగాను రూ.75 వేల ఖర్చు అయిందని ఆశాలు పేర్కొన్నారు.
వడ్డీలు పెరుగుతున్నాయి..
కంటి వెలుగు ప్రాజెక్టులో ఖర్చు చేసిన డబ్బులు ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టును ప్రజలు మర్చిపోయిండ్రు కానీ మాకు మాత్రం డబ్బులు రాలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి కార్యక్రమం నిర్వహించాం. రూ.30 వేలు ఖర్చుచేసినా.. అప్పులకు వడ్డీ పెరిగాయి. ఎట్లా తీర్చాలో అర్థం కావడం లేదు. కొలువు చేసి కట్టే దినసరి కూలీ పనులకు పోయింది నయం ఉన్నది. ప్రభుత్వం మా గోస చూసైనా సకాలంలో బిల్లు చెల్లించాలి.
- లలిత, ఆశావర్కర్, షాద్నగర్
పెండింగ్ బిల్లు చెల్లించాలి..
నాలుగేండ్లుగా పెండింగ్లో ఉన్న కంటి వెలుగు ప్రాజెక్టు నిర్వహణ బిల్లులు చెల్లించాలి. చాలీచాలని వేతనాలకు పనిచేస్తున్న ఆశావర్కర్లతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు పెట్టించింది. పైగా బిల్లులు ఇవ్వకుండా ఏండ్లుగా పెండింగ్లో పెట్టడం సబబు కాదు. వెంటనే బిల్లు చెల్లించాలి. లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం.
- కవిత, శ్రామిక మహిళ,
రంగారెడ్డి జిల్లా కన్వీనర్
సొమ్ము తాకట్టు పెట్టి అప్పు తెచ్చా
మా గ్రామంలో 5 రోజుల పాటు కంటి వెలుగు ప్రాజెక్టులో కంటి పరీక్షలు నిర్వహించాం. ప్రాజెక్టులో 20 మంది వరకు పనిచేశారు. వారికి రోజు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశాం. ఇందుకు రోజుకు రూ.2000 నుంచి 2,500 వరకు ఖర్చు వచ్చింది. ఇతర ఖర్చులతో మొత్తం ఐదు రోజులకు గాను రూ.20 వేల వరకు ఖర్చు వచ్చింది. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రూపాయి కూడా రాలేదు. తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరుగుతున్నాయి. మా సొమ్ము పోయేట్టు ఉంది.
- అనిత, ఆశావర్కర్, కొత్తుర్ మండలం, తిమ్మాపూర్