Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థాయిని మరిచి రేవంత్ మాట్లాడుతున్నరు : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో తాము చేరుతామని ఎమ్మెల్యేలు చాలా మంది సంప్రదిస్తున్నారనీ, తమతో టచ్లోలేని ఎమ్మెల్యే లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి తన స్థాయిన మరిచి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ప్రేమెందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ప్రకాష్ రెడ్డి, అందే బాబయ్య, కరుణాకర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి తన చిరకాల మిత్రుడనీ, పార్టీలు వేరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలమని తెలిపారు. దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అనీ, ప్రాంతీయ పార్టీల పుట్టుకకు అదే కారణమని విమర్శించారు. సీఎంలు, ఎంపీలను కూడా ఆ పార్టీ అధిష్టానం గౌరవించకపోవడం వల్లనే నేడు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. తాము టీఆర్ఎస్లా భయపెట్టి పార్టీ ఫిరాయింపులు చేయించడం లేదనీ, కేసీఆర్ విధానాలు నచ్చక, బీజేపీ సిద్ధాంతం నచ్చి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్తే ఏనాడో మంత్రి అయ్యేవాడన్నారు. కానీ, ఆయన ఆపార్టీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడారన్నారు. 2014 నుంచి ఆయన్ను కేసీఆర్ ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో తనకు తెలుసునన్నారు. సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ అయితే మలి యుద్ధం చేసింది కరీంనగర్, హుజూరాబాద్ అనీ, ఆ రెండు చోట్లా బీజేపీ గెలిచిందని తెలిపారు. ఇప్పుడు మునుగోడులోనూ గెలువబోతున్నదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు నిధుల కోసం సీఎంకు మొరపెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన రాజీనామా చేశారని తెలిపారు.