Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్‌లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్లస్థలాలివ్వాలి: సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ జిల్లాలో పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత రెండు నెలల నుంచి వేలాది మంది పేదలు ఇండ్లస్థలాల కోసం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. జక్కలొద్ది గ్రామంలోని సీలింగ్, మిగులు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని అక్కడే నివాసముంటున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్లస్థలాలు కేటాయించాలనీ, పట్టాలివ్వాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. జక్కలొద్ది గ్రామంలో సర్వే నెంబర్ 102 నుంచి 154 వరకు మొత్తం 296 ఎకరాల విస్తీర్ణం గల సీలింగ్ భూమి ఉందని తెలిపారు. ఇందులో 246 ఎకరాలు కబ్జాకు గురైందనీ, కేవలం 50 ఎకరాలు మాత్రమే మిగిలిందంటూ ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయని పేర్కొన్నారు. ఆ మిగిలిన భూమిలో వేలాది మంది ఇండ్లులేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. ఈ రకమైన భూములు కబ్జాకు గురైతే వెంటనే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఆందోళన జరుగుతున్నదని పేర్కొన్నారు. అప్పట్లో అసెంబ్లీలో చర్చ జరిగి పెద్ద దుమారం లేచిందని గుర్తు చేశారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులూ చాలా మంది ఈ ఆందోళన చేసినవారిలో ఉన్నారని తెలిపారు. అయినా నేటికీ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడాన్ని ఆపకపోవడం శోచనీయమని విమర్శించారు.
భూబకాసురులు కబ్జా చేస్తున్నా పట్టించుకోని అధికారులు
పెద్దపెద్ద భూబకాసురులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తమ్మినేని పేర్కొన్నారు. కానీ ఇండ్లు, ఇండ్లస్థలాల్లేని పేదలు కేవలం 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే మాత్రం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పేదలపై నిర్బంధం కొనసాగుతున్నదని విమర్శించారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న సుమారు 500 మంది పేదలపైన కేసులు పెట్టారని పేర్కొన్నారు. పదుల సంఖ్యల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. కావున సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని, వరంగల్ జిల్లాలో పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను ఇండ్ల స్థలాల కోసం కేటాయించి, క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో రాజీవ్ గృహకల్ప పేరుతో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయనీ, తక్షణమే వాటిని పేదలకు కేటాయించాలని సూచించారు. పేదలపై నిర్బంధాన్ని నిలిపేసి, అక్రమ కేసులను ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.