Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నారు
- నాలుగు పార్టీలు మారి నాపై నిందలా?
- కాంట్రాక్టుల కోసం పోతున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా :
- పీసీసీ చీఫ్ రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అనీ, ఓ చిల్లరదొంగంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. కొంత మంది జాతీయ నేతలకు ఆయన డబ్బులిచ్చి పార్టీ అధ్యక్షపదవిని కొనుక్కున్నారని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ, నువ్వు పీసీసీ పదవి వదులకుంటావా? అని రేవంత్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాజగోపాల్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మూడు గంటలు నాతో మాట్లాడినట్టు రేవంత్ చెప్పడం నిజం కాదన్నారు. ఇంట్లో కలవలేదనీ, బయట 40 నిమిషాలు మాట్లాడానన్నారు. ఆయన బ్లాక్ మెయిలింగ్ చేయడమే ఆయన బ్రాండ్ ఇమేజ్ దాని ద్వారానే డబ్బులు సంపాందించిన ఘనత రేవంత్‌ది అన్నారు. ఏ వ్యాపారం లేని ఆయనకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. ఆయనకు వ్యక్తిత్వమే లేదన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి నాపై నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయలేనన్నారు. దమ్ముంటే బీజేపీ ప్రభుత్వం వద్ద తాను లబ్ద్ధిపొందినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఓడిపోయే సీట్లో పోటీ చేశామనీ, కొడంగల్‌లో ఓటమిపాలయ్యాక రేవంత్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బతికున్నంతవరకు కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని, ఆ పార్టీ కార్యకర్తలను విమర్శించబోనన్నారు. తాను టీఆర్ఎస్లోకి పోవడం లేదనీ, ఆపార్టీపై యుద్ధం చేసేందుకు బీజేపీలోకి పోతున్నట్టు చెప్పారు.