Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలి :
- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త రావచ్చునని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్య చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనడంతో పాటు, నేలకొండపల్లి, ఆచర్లగూడెం గ్రామాల్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో అభివృద్ధే పరమావధిగా భావించి మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా అవిశ్రాంతంగా కృషి చేశానన్నారు. ఎంత చేసినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో కొంత రాజకీయంగా నష్టం జరిగిందని, అటువంటి నష్టాన్ని తిరిగి పునరావృతం కాకుండా కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించడం వల్ల పాలేరులో కార్యకర్తలకు దగ్గరగా ఉండలేకపోయానని అంగీకరించారు. నేడు పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరిచిన ప్రజాప్రతినిధులు పదివేల రూపాయల పథకంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆరాటపడుతున్నారన్నారు. అవి కూడా వారు సొంతంగా ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లను, వైన్‌షాప్ సిండికేట్లను పిండి మరి వసూలు చేసి తామే పేదల పట్ల ఔదార్యంగా పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని అక్కడికి వచ్చిన కార్యకర్తలు తుమ్మల దృష్టికి తీసుకువచ్చారు. ఏది ఏమైనా రాజకీయంగా రానున్న కాలంలో జరిగే పరిణామాలకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక తాను పార్టీ మారుతారా అని జిల్లాలో చర్చనీయాంశమైంది.