Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ జిల్లాలో సంఘటన
నవతెలంగాణ-కొత్తగూడ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్దచెరువు సమీపంలో సుడిగాలులు భీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. వివరాల్లోకి వెళితే.. ఆకాశాన్ని, భూమిని తాకుతూ ఏర్పడే పెద్ద పెద్ద సుడిగాలులనే టోర్నడో అంటారు. ఇవి మన దేశంలో చాలా తక్కువ. ఇలాంటివి ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే చూస్తుంటాం. ఈ భయానక సుడిగాలులు వచ్చే సమయంలో మనషుల్లో అలజడిని సృష్టిస్తాయి. దానికి ఏది అడ్డొచ్చిన ఆ దుమ్ములో కలిసి పోవాల్సిందే. అలాంటిదే కొత్తగూడ ఏజెన్సీ మండలం వెలుబెల్లిలో ఆకాశంపైకి గుండ్రంగా తిరుగుతూ నీళ్లు వెళ్తున్న దృశ్యం చోటుచేసుకుంది. టోర్నడో దర్శనం ఇవ్వడంతో పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలు భయాందోళనలకు గురయ్యారు. ఓ అరగంట పాటు సాగిన ఈ సుడిగాలుల భీభత్సానికి ఉరుకులు పరుగులు పెడుతూ ప్రజలు వింతగా చూశారు. సుడిగాలి నీళ్లను తీసుకొని రివ్వున ఆకాశానికి చేరింది. కాగా, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.