Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జాడేలేని 'డబుల్' ఇండ్లు: మంత్రి హరీశ్‌రావు
- సిద్దిపేట జిల్లాలో ఇండ్లలోకి గృహప్రవేశాలు
నవతెలంగాణ-ములుగు
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిన దాఖలాలు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి మిమ్మల్ని కొత్తింట్లోకి పంపడం సంతోషంగా ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి, చిన్న తిమ్మాపూర్ గ్రామాల్లో బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గృహ ప్రవేశాలకి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.60 వేలు ఇస్తే బేస్మెంట్కు కూడా సరిపోయేవి కావన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్ల మంచినీళ్ల గోస తీరిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజానీకం సంబురంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి, చిన్న తిమ్మాపూర్ సర్పంచ్ హంస మహేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.