Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ప్లీడర్ చాడ విజయభాస్కర్‌రెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పన్నెండు మంది న్యాయమూర్తుల పేర్లలో రెండు పెండింగ్‌లో ఉండిపోయాయి. అందులో విజరు పేరు ఇప్పుడు ఖరారైంది. ఆయనతో గురువారం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఫస్ట్ కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విజరు దుబ్బాకలో 1968 జూన్ 28న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఓయూలో బీఎస్సీ, ఎల్ఎల్బీ చేశారు. 1992, డిసెంబర్ 31న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1999 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా చేశారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా చేస్తూ న్యాయమూర్తి కాబోతున్నారు.
లాయర్ హత్య ఘటన పిల్‌గా స్వీకరణ
ములుగులో న్యాయవాది ఎం.మల్లారెడ్డి హత్య సంఘటనను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ మేరకు హెకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన వినతిప్రతంలోని అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి భూయాన్ ఆమోదం తెలిపారు దీంతో కోర్టు ఆ వినతిపత్రాన్ని పిల్‌గా స్వీకరించింది. ప్రతివాదులుగా చీఫ్ సెక్రటరీ, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, లా సెక్రటరీ, డీజీపీ, ములుగు ఎస్పీ, ఎస్హెచ్ఓలను చేర్చి నోటీసులు జారీ చేసింది.
వీఆర్వోల సర్ధుబాటు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి
ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ తాము ఇచ్చే తీర్పు ప్రకారమే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. సర్దుబాటు, విలీనం నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 121ను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు వీఆర్వోలు వేసిన రిట్‌ను బుధవారం జస్టిస్ మాధ వీదేవి విచారించారు. ఈ క్రమంలో ప్రతివాదులైన సీఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ ముఖ్యకార్శదర్శులు, సీసీఎల్ఏలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఏండ్ల తరబడి పనిచేసే వీఆర్వోలను బదిలీ చేయడానికి వీల్లేదని పిటిషనర్ల లాయర్ వాదించారు. వీఆర్వోలు పనిచేసే జిల్లాల్లోనే వేరే ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేయడమనేది విధాన నిర్ణయమని ప్రభుత్వం చెప్పింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.