Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ- బీబీనగర్
రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా రాష్ట్రంలో విద్యారంగానికి నిధులు మంజూరు చేస్తూ బలోపేతం చేస్తుందన్నారు. గురుకుల విద్యాసంస్థల సంఖ్య పెంచి మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. గురుకులాలు పాఠశాల విద్యకే పరిమితం కాకుండా జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 1400 పైచిలుకు గురుకుల విద్యాసంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాటాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగు తున్నాయని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార ం అందించేందుకు ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.
గ్రంథాలయం ప్రారంభం
బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామానికి చెందిన ఎన్నారై గూడూరు మహేందర్రెడ్డి తన తండ్రి నర్సిరెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన గ్రంథాలయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఎన్నారైలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా విద్యాధికారి నారాయణరావు, ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగళ్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిడి గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.