Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వితీయ వర్ధంతి సభలో సాగర్, వెంకట్రాములు, శ్రీరాంనాయక్
- రైతు, వ్యకాస, గిరిజన సంఘం నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అట్టడుగు వర్గాల హక్కుల గొంతుక సున్నం రాజయ్య అని రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస), గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి సాగర్, ఆర్ వెంకట్రాములు, ఆర్ శ్రీరాంనాయక్ అన్నారు. సున్నం రాజయ్య ద్వితీయ వర్ధంతి సభను బుధవారం హైదరాబాద్లోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడం ద్వారా రాజయ్య వాటి పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోడు సాగుదార్ల హక్కుపత్రాల కోసం తునికాకు కార్మికుల కమీషన్ రేట్లు పెంపుకోసం, సంతల్లో అధికారులు, దళారుల మోసాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. వాటితోపాటు వ్యవసాయ కూలీల రేట్ల పెంపు, ఇండ్లు, ఇండ్లస్థలాలు, సాగుభూముల కోసం పేదలు సాగించిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. నిర్బంధాలు, ఆటుపోట్లు, నక్సలైట్ల బెదిరింపులు, పాలకవర్గాల ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం నిలబడ్డారంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. పోడు సాగుదార్లకు హక్కుపత్రాలూ, బ్యాంకుల్లో రుణాలివ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.