Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో బిల్లుపెట్టే ఆలోచనను విరమించుకోవాలి
- విద్యాపరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి హరగోపాల్ డిమాండ్
- ఉన్నత విద్యామండలి వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 బిల్లును పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనను విరమించుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఎన్ఈపీకి చట్టబద్ధత కల్పించొద్దని కోరారు. బుధవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం మండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ఎన్ఈపీ అమల్లోకి వస్తే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి ఎలాంటి హామీ లేదన్నారు. నూతన విద్యావిధానంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారని విమర్శించారు. నాలుగేండ్ల డిగ్రీ విద్యను ప్రవేశపెడతారని చెప్పారు. చదువు మధ్యలోనే మానేసేందుకు అవకాశముందన్నారు. దీంతో పేదలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల్లో ఎక్కువ మంది డ్రాపౌట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నూతన విద్యావిధానాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఆర్గనైసింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీపీటీఎఫ్ అధ్యక్షులు వై అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్టప్ప, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం పరశురాం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, రాష్ట్ర నాయకులు రియాజ్, శ్యామ్, అనిల్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, డీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.