Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం, పరిపాలనపై అన్ని విద్యాసంస్థల్లో బోధించాలి
- సామాజిక అభివృద్ధికి విద్య కీలకం
- మూలాలను మర్చిపోతే చరిత్ర క్షమించదు
- మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశాన్ని గౌరవించాలి
- ఉస్మానియాది ఎంతో చరిత్ర, ఉద్యమాల నేపథ్యం
- ఓయూ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ
- సీజేఐకి గౌరవ డాక్టరేట్ ప్రదానం
నవతెలంగాణ బ్యూరో/ఓయూ - హైదరాబాద్
భారత రాజ్యాంగమే దేశ ప్రజలందరికీ రక్షణ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగం, పరిపాలనపై అన్ని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు బోధించాల్సిన అవసరముందని ఆయన వివరించారు. సామాజిక అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని చెప్పారు. మూలాలను మర్చిపోతే చరిత్ర క్షమించబోదని అన్నారు. మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశాన్ని మర్చిపోవద్దనీ, గౌరవించాలని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ వర్సిటీ ప్రాంగణంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్, ఓయూ వీసీ డి రవీందర్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ముఖ్యఅతిధిగా హాజరైన రమణ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతోపాటు అనేక మంది ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఓయూ అందించిందని గుర్తు చేశారు. ఇక్కడ చదివిన వారు ఎంతో మంది గొప్పస్థానాలకు చేరారని అన్నారు. నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎంతో మంది గొప్ప వారికి ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందించిందని చెప్పారు. ఇప్పుడు తనకు ఈ గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాను ఓయూ లా కాలేజీలో చేరాలనుకున్నాననీ, కానీ అవకాశం దక్కలేదని చెప్పారు. అయినా ఈ వర్సిటీలో ఎన్నో తీపిగుర్తులున్నాయనీ, ఈ-హాస్టల్, క్యాంటీన్, గ్రంథాలయంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. కుటుంబాల్లో తొలితరం విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని అన్నారు. వారిపై ఎన్నో బాధ్యతలున్నాయని వివరించారు. ఓయూ విద్యారంగ ప్రగతిలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. ఎంతో చైతన్యమైన సంస్కృతి, ఉద్యమాల నేపథ్యం ఇక్కడ చదివే విద్యార్థులకుందని చెప్పారు. పాతతరంలో ఉన్న విలువలను మర్చిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ సమాజం నుంచి వచ్చినా దాన్ని కొనసాగించాలన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అదే సమయంలో మూలాలను మర్చిపోవద్దనీ, అలా చేస్తే చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. యునెస్కో నివేదిక ప్రకారం ఏడు వేల భాషలు అంతరించిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యాన్ని బాగా చదవాలన్నారు. ఉత్తరాలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తరాలు రాసి నెహ్రూ చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. వాతావరణ మార్పులు, పర్యావరణ మార్పుల సవాళ్లను అధిగమించాలని కోరారు. జీవవైవిధ్యాన్ని కాపాడాలని సూచించారు. సమాజంలో సోద రభావం పెంపొందించాలన్నారు. విద్యార్థులు ఆలోచించాలనీ, ప్రశ్నించాలనీ, అనేక అంశాలపై చర్చించాలని కోరారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ఉండాలన్నారు. పట్టాలు పొందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ'అన్న దాశరథి, 'తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!'అని కాళోజి రాసిన కవిత ఆయన చదివి వినిపించారు.
గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలి : తమిళిసై
విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, వాటిని చేరుకోవడానికి కష్టపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులు సెల్యూట్ చేయాలని సూచించారు. వారు అనేక త్యాగాలు చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. చదువు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. 'ఓయూకు వచ్చే వరకు మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ చదువు స్థాయి ఎలా ఉండేది, ఇక్కడ చదువు పూర్తయ్యాక మీ ఆలోచన, ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చిందో, ప్రొఫెసర్లు ఎలా ప్రభావం చూపించారు, ఇలా అనేక విషయాలను పరిశీలించుకోండి'అని ఆమె సూచించారు. జీవితంలో విజయం సాధించడానికి షార్ట్‌కట్ పద్ధతులను అనుసరించొద్దనీ, కష్టపడాలని కోరారు. అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆకాంక్షించారు. క్రమశిక్షణను అలవర్చుకోవాలనీ, ఉదయం తొందరగా లేవాలని సూచించారు. పట్టుదల, కృషి వల్లే జస్టిస్ ఎన్వీ రమణ ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. అందరూ సెల్‌ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని చెప్పారు. సెల్‌ఫోన్‌కు వీలైనంత దూరంగా ఉండాలని కోరారు. తనను గౌరవించినా సంతోషమే, గౌరవించకపోయినా సంతోషమేనంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు. 'దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు'అని తెలుగులో ఆమె గురజాడ పలుకులను ఈ సందర్భంగా చదివి వినిపించారు.
పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ : రవీందర్
పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని ఓయూ వీసీ డి రవీందర్ అన్నారు. త్వరలోనే సివిల్ సర్వీసెస్ అకాడమీని ప్రారంభిస్తామని చెప్పారు. విద్యారంగం, పరిశోధన, నాణ్యమైన చదువులో ఓయూ ప్రగతి సాధించిందన్నారు. ఎన్ఐఆర్ఎఫ్, ఇతర ర్యాంకుల్లో మెరుగ్గా ఉందని అన్నారు. ఎంఫిల్, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్, చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్, జస్టిస్ ఎన్వీ రమణ బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి చంద్రయ్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఇఫ్లూ వీసీ ఈ సురేష్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, ఓయూ రిజిస్ట్రార్ పి లక్ష్మినారాయణ, పరీక్షల నియంత్రణాధికారి శ్రీనగేష్, ఓఎస్డీ రెడ్యానాయక్, డీన్లు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.