Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక వర్షాలు, వరదలే కారణం
- గతేడాది 95 లక్షల ఎకరాల్లో
- ఈసారి 80.85 లక్షల ఎకరాల్లోనే పంటలు
- 15 లక్షల ఎకరాల్లో పంటలే వేయలే
- వరి, పత్తి తగ్గిన వైనం
- ఆహార పంటలు సైతం వెనకపట్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సాగు ఆందోళనకరంగా మారుతున్నది. భారీ వర్షాలు, వరదలు పొటెత్తటంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. వానాకాలం సీజన్లో పంటలు పూర్తి కాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సగానికి సగం సాగు తగ్గిపోయింది. క్రమంగా వర్షాలు తగ్గుతున్నప్పటికీ విత్తనం వేసేందుకు సమయం మించిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసీజన్లో వేసే పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ప్రత్యామ్నాయంగా వేసే అవకాశమూ లేదు. ప్రకృతివైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక భారంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదితో పొల్చితే 83శాతం వర్షాపాతం అధికంగా ఉన్నది. భూగర్భజలాలు పెరిగినప్పటికీ అవి పంటలకు మాత్రం అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వానలు కురిసి నేలలు తడి ఆరకపోవడంతో పంటలకు అనుకూలంగా లేవు. ఒకవేళ ఆరుతడి పంటలు వేసినా అవి దిగుబడి వచ్చే పరిస్థితి లేవు. యాసంగి సీజన్ వరకు ఎదురుచూడాల్సిందే. ఈ నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో సాగుయోగ్యమైన నేల కోటి 23 లక్షల ఎకరాలున్నది. అందులో ఈ సమయానికి 89.22 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. గతేడాది ఈ సమయానికి రూ 96.92 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 80.85 లక్షల ఎకరాల్లో పంటలేశారు. అధిక వర్షాల కారణంగా అదును అనుకూలించకపోవడంతో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. అందులో ప్రధాన పంటైన వరి మాత్రం గతేడాది 25.22 లక్షల సాగు చేయగా, ఈసారి 18 లక్షల ఎకరాల్లోనే వరి నాటారు. దీంతో వ్యవసాయ శాఖ ఆగస్టు పూర్తయ్యేనటికి సాగు అయ్యే పరిస్థితులు లేవు. దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో అది తగ్గిపోయింది. మరోవైపు రాష్ట్రంలో సాధారణంగా పత్తి 50 లక్షల ఎకరాల్లో వేస్తారు. ఇప్పటికి 45.42 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఐదారు లక్షల ఎకరాల్లో పత్తి వేసేందుకు అవకాశం లేకుండాపోయింది. వానాకాలం సీజన్ ప్రారంభంలో వానలు ఆలస్యం కావడం, ఆ తర్వాత పంటలు వేసే సమయానికి భారీ వర్షాలు పడటం ఆందోళనకరం. దీంతోపాటు పొడి వాతావరణంలోనే పొద్దుతిరుగుడు దిగుబడి వస్తున్నది. అది కూడా వేయలేదు. ఆముదానికి మాత్రం తొలకరి ప్రారంభంలో విత్తనం వేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
జొన్న పంటకు తెలంగాణ నేలలు ప్రసిద్ధి. దాదాపు 95వేల ఎకరాల్లో ఆ పంటను వేసారు. కానీ 25వేల ఎకరాలకు పరిమితమైంది. పత్తి తర్వాత వాణిజ్య పంటగా ఉన్న మొక్కజొన్న రాష్ట్రంలో దాదాపు 82 ఎకరాల్లో సాగవుతున్నది. నేటికి 42వేల ఎకరాల్లో సాగై, 50శాతానికి పడిపోయింది. రాగి పంట 193 ఎకరాల్లో సాగైంది. గతేడాదితో పోల్చితే కంది 63.13 శాతం, పెసర కేవలం 37 శాతం, ఉల్వలు 56 శాతమే సాగయ్యాయి. ఉన్నంతలో సోయాబీన్ పంట ఆశాజనకంగా ఉంది. అయిల్ సీడ్ విత్తన సాగులోనూ ఇదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతియేటా 20వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, కేవలం 6244 ఎకరాల్లోనే సాగైంది. అయితే జిల్లాల వారీగా సాగులో వ్యత్యాసం కనపడుతున్నది. ఆదిలాబాద్, కొమురంబీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, వికరాబాద్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, జనగాం వరంగల్, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో సాగైంది. సూర్యాపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్ జిల్లాల్లో 30 శాతానికి మించలేదు. ఆదిలాబాద్ జిల్లాల్లో వందశాతం దాటింది. మిగతా జిల్లాల్లో సగానికి మించకపోవడంతో ఆహార పంటలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.