Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగాపూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- రంగాపూర్ నుంచి వికారాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర
నవతెలంగాణ-పరిగి
ప్రభుత్వ భూమిలో పేద ప్రజలకు ఇండ్ల స్థలాలివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌లోని ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రంగాపూర్ నుంచి వికారాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి చెరుపల్లి సీతారాములుతో పాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ హాజరై మాట్లాడారు. పరిగి మండలం రంగాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 18లో 9 ఎకరాల 39 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని అన్నారు. ఈ కబ్జాకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), వ్యకాస ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని తెలిపారు. తమ పోరాటాలతో దిగొచ్చిన తహసీల్దార్ విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆ భూమి కబ్జాదారుల చేతుల్లోనే ఉందన్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని స్పష్టంచేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలకు హద్దు, అదుపు లేకుండా పోయిందన్నారు. మోడీ ప్రభుత్వం జుట్టుపైన తప్పా అన్నింటిపైనా జీఎస్టీ వేస్తూ ప్రజలపై పెనుభారం మోపుతున్నదని విమర్శించారు నిరుద్యోగం పెరగడం, మతసామరస్యం దెబ్బతీయడం, రాజ్యాంగ మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని అన్నారు. సీపీఐ(ఎం), వ్యకాస ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మైపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నాయకులు హబీబ్, బసిరెడ్డి, సత్తయ్య, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.