Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలు కాని స్వామినాథన్ సిఫారసులు
- మద్దతతు ధర లేదు
- బోడేపూడి ఆశయాలు కొనసాగించాలి
- బోడేపూడి వర్ధంతి సందర్భంగా జరిగిన సెమినార్లో అఖిల భారత రైతుసంఘం సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, బీవీకే ట్రస్ట్ చైర్మెన్ తమ్మినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీ, సంక్షేమపూరిత వ్యవసాయం, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు.. తదితర హామీలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2014 నుంచి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని అఖిలభారత రైతుసంఘం (ఏఐకేఎస్) సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, బీవీకే ట్రస్టు చైర్మెన్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 25వ వర్ధంతి సందర్భంగా బోడేపూడి విజ్ఞాన కేంద్రం జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక మంచికంటి మీటింగ్ హాల్లో 'వ్యవసాయరంగం- వర్తమానం-భవిష్యత్, ప్రజలపై ప్రభావం' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న విజ్జుకృష్ణన్, తమ్మినేని మాట్లాడారు. 1992 మొదలు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతుసంఘం పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ 20 ఏండ్లలో 20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 2014-22 వరకు రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. ఉత్పత్తి ఖర్చు కింద 50శాతం ఎక్కువ మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రుణమాఫీ, పంటలకు మద్దతు ధర తదితర హామీలను విస్మరించి కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రం 2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం చరిత్రాత్మకమన్నారు. ఆహారభద్రత గురించి పట్టని మోడీ ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అని పిలుపునివ్వడం హాస్యాస్పదని తెలిపారు. భూసేకరణకు రైతుల అంగీకారం అవసరం లేదనడం అత్యంత దుర్మార్గమన్నారు. కేరళలో వరికి హెక్టార్‌కు రూ.30వేల సబ్సిడీని పంచాయతీలే ఇస్తున్నాయన్నారు. కానీ ఇక్కడ రైతుబంధు, రైతుభరోసా పేరుతో ప్రగల్భాలు పలుకుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని సరళ భాషలో చెప్పటం బోడేపూడి ప్రత్యేకతని తమ్మినేని గుర్తుచేశారు. మంచి కమ్యూనిస్టు అంటే బోడేపూడిలా ఉండాలన్నారు. బోడేపూడి ఆశయాలు కొనసాగించేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సెమినార్ ప్రారంభానికి ముందు బోడేపూడి విజ్ఞాన కేంద్రం సేవా కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను విజూకృష్ణన్ ప్రారంభించారు. బోడేపూడి చిత్రపటానికి తమ్మినేని పూలమాల వేసి నివాళులు అర్పించారు. సెమినార్లో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, బీవీకే ట్రస్టు కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేష్, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వర్లు, బంతు రాంబాబు, వై.విక్రమ్, నాయకులు కాసాని ఐలయ్య, మల్లెంపాటి వీరభద్రం, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.