Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది అడవి నుంచి గిరిజనులను గెంటేసే కుట్ర
- బిల్లును ఉపసంహరించుకోవాలి :తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో అటవీ సంరక్షణ నియమాలు- 2022 పేరుతో ప్రవేశపెడుతున్న సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోట్లాది మంది గిరిజనులను అడవుల నుంచి గెంటేసి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రమాదకర నిబందనలు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు,అటవీ సంపదను కార్పొరేట్లకు బదలాయించటం కోసం అటవీ సంరక్షణ చట్టం (1980) లో కఠినంగా నిబంధనలున్నాయని తెలిపారు. ఆ నిబంధనలను సమూలంగా మార్చి, అటవీ సంపదను కార్పోరేట్ల కు కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం 'అటవీ సంరక్షణ నియమాలు- 2022' పేరుతో బిల్లును తీసుకొస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 28 న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఈ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా గిరిజనులు వ్యతిరేకిస్తున్నా పెడచెవినపెట్టి పార్లమెంటులో బిల్లును ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందితే అడువులపై ఆధారపడ్డ కోట్లాదిమంది గిరిజనులు బలవంతంగా గెంటివేతకు గురవుతారని తెలిపారు. ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో విలువైన మైనింగ్, ఖనిజ సంపదను అంబానీ, ఆదాని వంటి కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నదని విమర్శించారు. అటవీ భూమిని పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టాలంటే 1980 చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత బిల్లులో ఆ నిబంధనలన్నిటిని సరళతరం చేస్తూ సింగిల్ విండో విధానం ద్వారా కేంద్ర క్యాబినెట్ ఆధ్వర్యంలో వేసిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇస్తే చాలు, అటవీ భూమిని బదలాయించొచ్చు అని పేర్కొన్నదని తెలిపారు. . ఇది షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అటవీ భూమిని బదలాయించాలంటే షెడ్యూల్ ప్రాంతంలోని గ్రామసభ అనుమతి తప్పనిసరన్న నిబంధనను ఈ బిల్లులో పూర్తిగా ఎత్తివేశారని పేర్కొన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములను గిరిజనులకు 10 ఎకరాల లోపు హక్కులు కల్పించాలని చెప్పిందని గుర్తుచేశారు. అటవీ సంరక్షణ నిబంధనలు 2022 ప్రకారం ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనుమతిని రాష్ట్రాలు కోరాలంటూ నూతన బిల్లులో పేర్కొనడం అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ను పూర్తిగా నిర్వీర్యం చేయడమేనని తెలిపారు. అటవీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చి రోడ్లు, రైల్వే, విద్యా, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు అటవీ భూములను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన అవసరంలేదంటూ ఈ బిల్లులో పేర్కొన్నదని తెలిపారు. అడవులను పెంచే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇక నుంచి ప్రయివేటువాళ్లు సైతం అడువులు పెంచుకోవచ్చనే ప్రమాదకరమైన నిబంధన ఈ బిల్లులో పొందుపరిచారని పేర్కొన్నారు. దీని వల్ల శతాబ్దాలుగా అడవుల్లో ఉంటూ అక్కడి ఫల సాయంపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసి గిరిజనుల పరిస్థితి అగమ్య గోచరమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ గిరిజనులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే అటవీ సంరక్షణ నియమాలు 2022 బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.