Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రుల కమిటీ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పౌర సరఫరాల సంస్థ వద్ద భారీగా ధాన్యం నిల్వలున్న నేపథ్యంలో త్వరితగతిన మిల్లింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రుల కమిటీ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతమున్న ధాన్యం నిల్వలను ఏ విధంగా తగ్గించుకోవాలి..వచ్చే ఖరీఫ్ సీజన్లో ధాన్యం నిల్వలకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ వద్ద 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వలున్నాయని ఈ ధాన్యాన్ని అత్యంత వేగంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాలని నిర్ణయించారు. చిన్న చిన్న కారణాలతో బియ్యాన్ని తిరస్కరించకుండా ఎఫ్‌సీఐతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అనిల్ కుమార్‌కు మంత్రులు సూచించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని వేగంగా మిల్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనే దానిపైనా చర్చించారు. దీనిపై సోమవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.