Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ' జాతీయ సదస్సులో నోవార్టిస్ డైరెక్టర్ సుభాస్ చంద్ర
నవతెలంగాణ-పటాన్చెరు
మారుతున్న కాలంతో పాటు మనం నిత్యం వాడే ఔషధాలకు కాలం చెల్లిపోతోందని, అందువల్ల తదుపరి తరం ఔషధాలపై ఫార్మసీ విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్లోని నోవార్టిస్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ ఎం.సుభాస్ చంద్ర ఉద్బోధించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో 'ఫార్మసీ అండ్ ఫార్మా స్యూటికల్ సైన్సెస్'పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మనం వినియోగిస్తున్న మాలిక్యూల్ ఔషధాలు త్వరలో కనుమరుగు కానున్నాయని, ఇకమీదట బయోలాజిక్స్, బయోసిమిలర్లు, సెల్-జీన్ థెరపీ, రేడియో మెడిసిన్ వ్యవహరించే అధునాతన యాక్సిలరేటర్ అప్లికేషన్లు, న్యూక్లియర్ మెడిసిన్ వంటివి మనగడలోకి రానున్నాయన్నారు. ఈ రంగాల్లోకి ప్రవేశించి, నూతన సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యార్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సాఫ్ట్ కిల్స్ లేక చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురవుతున్నారన్నారు. నాట్కో ఫార్మా అసోసియేట్ ఉపాధ్యక్షులు డాక్టర్ బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సాంకేతిక అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని, దాన్ని ఫార్మా పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చో యోచించాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ తరహా సదస్సులు దోహదపడతాయని స్లేబ్యాక్ ఫార్మా డైరెక్టర్ హరీష్ అభిప్రాయపడ్డారు. తొలుత గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ స్వాగతోపాన్యాసం చేశారు. కార్యక్రమంలో ఫార్మా స్యూటికల్స్ దిగ్గజుడిగా పేరొందిన ప్రొఫెసర్ సీవీ సుబ్రమణ్యం, జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వీరేష్, ఎంఎన్ఆర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.అళగర స్వామిలను సత్కరించారు. పరిశోధనా పత్రాల సంకలనాన్ని ఆవిష్కరించారు. దాదాపు 300 మంది విద్యార్థులు, నిర్వాహక కార్యదర్శి కింగ్స్టన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.