Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డి, దాసోజుతో సహా పలువురు కీలక నేతలు చేరే అవకాశం
- కేసీఆర్ మనువణ్ని గురుకులాలకు పంపాలి : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈనెల 21న అమిత్‌షా సమక్షంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సిద్దిపేట మురళీయాదవ్, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో పాటు పలువురు కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలను సహించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు. ఏదైనా సమస్య మొరపెట్టుకుందామని పోతే..''సంఘాన్ని పక్కనపెట్టి రండి. సంఘాలేంది?'' అంటూ అహంకారపూరితంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలోనే టీఆర్ఎస్ ఖాళీ కాబోతున్నదనీ, పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. చేరికలపై ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు కాబోతున్నదన్నారు. తమ నియోజకవర్గాల్లో కనీసం పింఛన్లు కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారని విమర్శించారు. హుజూరాబాద్‌లో చిల్లర వేషాలు వేస్తున్న టీఆర్ఎస్ నాయకుడికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలను నేడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనీ, కనీసం విద్యార్థులకు తిండి కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితుల్లోకి నెట్టేసిందనీ విమర్శించారు. గతంలో వారంలో మూడుసార్లు నాన్‌వెజ్‌తో కలిపి వర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేవారని గుర్తుచేశారు. నేడు నాణ్యతలేని అన్నం పెడుతున్న దుస్థితి ఉందనీ, దీంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారనీ, పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయని బాసర త్రిబుల్ ఐటీ, పలు గురుకుల పాఠశాలలను ప్రస్తావించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అనే వార్తలు వింటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తన మనవడు తినే నాణ్యమైన బియ్యాన్ని గురుకులాల్లో పెడుతున్నామంటూ కేసీఆర్ చెప్పారనీ, ఆయన మనువణ్ని గురుకులాలకు పంపాలని సవాల్ విసిరారు. గురుకుల టీచర్లతో కేసీఆర్ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు.