Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని నరేంద్రమోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాజిక మాధ్యమాల్లో డిస్ప్లే పిక్చర్ (డిపి) మార్పు వల్ల ఏమవుతుంది...జీడీపీ మారితే దేశానికి మంచి జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయి విలువ పైన దష్టి సారించాలన్నారు. శుక్రవారంనాడాయన ట్విట్టర్లో 'ఆస్క్ కేటీఆర్' పేరుతో నెటిజనులతో సంభాషించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు ఆయన తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. ఓ నెటిజన్ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ... పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదన్నారు. కానీ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదలకు సహాయం చేయడం మానేసి, కార్పొరేట్ సంస్థలకు దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారనీ, ఇదీ ఆయన పనితీరు అని విమర్శించారు. ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రాల్లో పర్యటిస్తే ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో బీజేపీకి ఉన్న మందబలంతో ప్రజలపైన భారీగా పన్నులు పెంచుతుందనీ, రాష్ట్రాలు వ్యతిరేకించినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా ఇచ్చే యంత్రాంగం మాత్రమే అనీ, నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని స్పష్టత ఇచ్చారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరణ చేయడం ద్వారా రైతులు సహా, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. బీజేపీ నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారంటూ ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్తూ... ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బీజేపీ నేతలు గోబెల్స్ శిష్యులనీ, అబద్ధాలను ప్రచారం చేయడం, ద్వేషం పెంచడంలో సిద్ధహస్తులని అన్నారు. ఈ అబద్ధపు ప్రచారాన్ని ఎండగడ్తూ, రాష్ట్రంలో తాము చేస్తున్న అభివద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ... తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అది మరో ఉప ఎన్నిక మాత్రమేననీ, దాంతో ఏం మారుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు, పదోన్నతుల విషయాలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్తానన్నారు. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు వైస్ చాన్సలర్్, డైరెక్టర్ క్యాంపస్‌లోనే ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్)పై హైకోర్టు స్టే ఇచ్చిందనీ, దాన్ని రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలోనే మెట్రోరైల్ విస్తరణపై ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏవియేషన్ సంబంధిత సిలబస్‌తో యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు దాదాపు పదివేల ఎకరాల్లో 19 విభిన్న ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. భూ సేకరణకు సంబంధించిన స్వల్ప సమస్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభోత్సవం కొంత ఆలస్యం అవుతుందనీ, త్వరలోనే అవి పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కాలి గాయం నుంచి కోలుకుంటున్నాననీ, త్వరలోనే విధులకు హాజరవుతాననీ చెప్పారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వాటిని ఆకలింపు చేసుకోవాలన్నారు. దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. 'జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్రం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లా డుతున్న వారిపౖౖె ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ తమదివాక్ స్వేచ్చను సమర్థించే ప్రజాస్వామిక ప్రభుత్వం అనీ, కానీ దురదష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ వాక్ స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నదనీ,దాన్ని ఎవరూ సహించాల్సిన అవసరం లేదన్నారు.