Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని శ్రామిక మహిళలు చాటాలి :
- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని శ్రామిక మహిళు చాటాలనీ, ఆగస్టు 14న జనజాగృతిని జయప్రదం చేయాలని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు కె.హేమలత పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. జిల్లాల నుంచి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె. హేమలత మాట్లాడుతూ 76వ స్వాతంత్రోద్యమ ఉత్సవాల్లో రాష్ట్రంలోని శ్రామిక మహిళలు గణనీయ సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలు, శ్రామిక మహిళల హక్కులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఘాతం కల్గిస్తున్నాయనీ, ప్రజాస్వామ్య - పౌర హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలకు కార్మికవర్గాన్ని బలి చేస్తున్నాయన్నారు. నిత్యావసర ధరలు, నిరుద్యోగం, ఆకలి చావులు, విద్య, వైద్య రంగాలను సామాన్యులకు దూరం చేసే విధానాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని చెప్పారు. దేశంలోని సామాన్యుల సమస్యలు వెలుగులోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం మతోన్మాద శక్తులను రెచ్చగొడుతున్నాయనీ, అజాదీకా అమృతోత్సవాల పేరుతో ప్రజల దృష్టిని మళ్ళించాలని చూస్తున్నాయని వివరించారు.