Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం
- నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలఇంక్రిమెంట్ : పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పాల వారోత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ - ధూల్‌పేట్
పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతం.. అతి శ్రేష్టమైంది.. అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 'తల్లి పాలు ముద్దు- డబ్బా పాలు వద్దు' నినాదంతో హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శుక్రవారం తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మిల్క్ బ్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఓపీలో, చిన్నపిల్లల విభాగంలో సేవలను పరిశీలించారు. ప్రసవానికి వచ్చినప్పుడు వార్డుల్లో అందుతున్న వైద్య సేవలు, లేబర్‌రూమ్‌లో సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తల్లిపాల వారోత్సవాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజల్లో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పెంచాలని చెప్పారు. బిడ్డకు తల్లిపాలతో పోల్చదగినది మరేదీ లేదన్నారు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానమని, ప్రతి తల్లీ గమనించాలని సూచించారు. ఎన్.ఎస్.యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లిపాలు అందాలన్న ఉద్దేశంతో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పేట్లబురుజులో ఆగస్టు ఒకటి నుంచి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా యని చెప్పారు. ప్రపంచ దేశాల్లోకెల్లా బంగ్లాదేశ్‌లో 88 శాతం మంది తల్లులు ఆరు నెలలపాటు పిల్లలకు పాలు ఇస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ నేషన్‌గా బంగ్లాదేశ్‌ను డబ్ల్యూహెచ్‌వో గుర్తించిందన్నారు. మన దేశంలో కూడా ఇస్తున్నారని, అయితే 36 శాతం మంది మాత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారని చెప్పారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారని, సీ సెక్షన్ ఆపరేషన్ల వల్ల ఇది జరుగుతోందని చెప్పారు. తల్లి పాలు ముద్దు- డబ్బా పాలు వద్దు అన్న నినాదంతో ముందుకు పోవాలన్నారు. తల్లికి, శిశువుకు మేలు జరుగుతుందన్నారు. మొదటి గంటలో తల్లి పాలు, ఆరు నెలలపాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించొచ్చని సర్వేలు చెబుతున్నాయని గుర్తు చేశారు.