Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న అతి భారీ వర్షాలు... 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
- వచ్చే నాలుగైదు రోజులు పలుచోట్ల భారీ, అతిభారీ వర్షాలు
- ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో ఈ నెల ఏడో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల భారీ నుంచి
అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. రాబోయే మూడ్రోజుల పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే నాలుగైదు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. 8,9 తేదీలకు సంబంధించి ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ హెచ్చరికను జారీ చేసింది. 6,7 తేదీలకు గానూ కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
మధిరలో భారీ వర్షం
ఖమ్మం జిల్లా మధిరలో శుక్రవారం రాత్రి పది గంటల వరకు 10.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం రికార్డయింది.
398 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, జగిత్యాల, జనగాం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.